ప్రజలు పన్ను రూపంలో కట్టే ప్రతి రూపాయి.. అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చవ్వాల్సిన ప్రజాధనం. కానీ అదే నిధులు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలైన నిధులు లక్ష్యానికి చేరాయా? లేక మధ్యలోనే మాయమయ్యాయా? అనే ప్రశ్నలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజాధనం దుర్వినియోగం జరిగితే దాని భారం చివరకు సామాన్యుడిపైనే పడుతుందని తెలిసందే..
ఇది చాలదన్నట్టు ప్రతి శాఖలో లంచావతారులు అక్రమంగా డబ్బులు వసూల్ చేస్తూ.. అడ్డగోలు ఆస్తులు సంపాదించుకుంటున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంతటితో ఆగని ఈ ఆశాపరులు ఎక్కడ సందు దొరికితే అక్కడ దోపిడీకి తెగబడుతున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట దొంగ బిల్లుల పేరుతో ప్రజాధనాన్ని దోచుకునే వారి సంఖ్య పెరుగుతోందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
చేయని పనులకు బిల్లులు, నకిలీ రికార్డులు, కాగితాలపై మాత్రమే కనిపించే అభివృద్ధి పనులు.. ఇలా కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు దుర్వినియోగమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలు ప్రభుత్వ ఖజానాకే కాదు, ప్రజల విశ్వాసానికీ కూడా భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి.. ప్రస్తుతం ఇలాంటి భారీ ఫ్రాడ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.
జనగామ కలెక్టరేట్ నిధుల్లో దాదాపు కోటి రూపాయలు మాయం కావడం సంచలనంగా మారింది. కంప్యూటర్ల కొనుగోలు పేరుతో భారీ స్కాంకు పాల్పడిన ముగ్గురు కలెక్టరేట్ ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే రోజు కంప్యూటర్ల పేరిట నకిలీ బిల్లు సృష్టించి 2026 ఫిబ్రవరిలో సొమ్ము బదిలీ చేసినట్టు అంతర్గత తనిఖీల్లో వెల్లడయింది. అయితే బిల్లు ప్రకారం ఒక్క వస్తువు కూడా భౌతిక తనిఖీలో లభించలేదని కలెక్టర్ కార్యాలయం పేర్కొంది.
వారిపై శాఖాపరమైన చర్యలు ప్రారంభించినట్టు సమాచారం.. కాగా జనగామ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నం.387/2026 సెక్షన్ కింద నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఇదే తరహాలో దిక్సూచి పుస్తకాల పేరిట కూడా రూ.46.50 లక్షలు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి..












