Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై నిరసన తెలిపేందుకు సోమవారం పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మద్దతుదారులు ప్రయత్నించారు. వారి నిరసనలు ఉధృతమవుతున్న తరుణంలో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై CJP ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తప్పుపట్టారు. వీధుల్లో ఉన్న విద్యార్థులకు తక్షణమే మద్దతుగా నిలవాలని ఎంపీలందరినీ కోరారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తూ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
కాగా, అంతకుముందే అభిజిత్ దీప్కే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. ప్రస్తుతం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అభ్యర్థన మేరకు డిప్కే ఈరోజు తన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. వాంగ్‌చుక్ స్వయంగా 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన అనంతరం జూలై 18న ఆసుపత్రిలో చేరగా, ఆ తర్వాత డిప్కే ఈ దీక్షను ప్రారంభించారు.
తన ఆరోగ్యం నిలకడగా ఉన్నందున 'సంసద్ చలో' ర్యాలీలో పాల్గొనేందుకు వీలుగా తనను డిశ్చార్జ్ చేయాలని సోనమ్ వాంగ్‌చుక్ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి అధికారులను కోరారు. తనను త్వరగా జంతర్ మంతర్ కు పంపకపోతే పార్లమెంటు వరకు పాదయాత్ర చేస్తానని ఆయన చెప్పారు.
అంతకుముందు పార్లమెంట్ వైపు కవాతు చేయడానికి ప్రయత్నించిన వందలాది మంది నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద గుంపును నియంత్రించడానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.












