రాజకీయాలు

దొరల ఆస్తులపై దుమారం.. కేటీఆర్ కౌంటర్‌తో ముదిరిన పొలిటికల్ వార్!

రచన: Venu•••12 నిమిషాల పఠనం

గతంలో కవిత ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలు తెరమీదికి వచ్చాయి.. తాము డబ్బుకోసం చాలా కష్టపడ్డామని, రెంట్ కట్టడానికి కూడా సరిపడా అమౌంట్ లేదని.. ఒకగానొక దశలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కొత్తలో పార్టీని కూడా నడపాలంటే కష్టమైందని ఆమె చెప్పిన విషయలు తెలంగాణ ప్రజలు మరచిపోలేదు.

రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం ఏకే 47 తూటాల్లా పేలుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణను కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అడ్డంగా దోచుకుందని, ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ అవుతుందని చెప్పిన పెద్ద దొర.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం, ఆయన అనుచర వర్గం మాత్రమే బంగారుమయంగా మారారని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు..

ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబ ఆస్తుల వ్యవహారం మరోసారి కేంద్రబిందువుగా మారింది. సిరిసిల్ల పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-కేటీఆర్‌కు సంబంధించిన స్టార్ హోటళ్లను ప్రస్తావించడంతో మొదలైన రాజకీయ విమర్శలు.. కేటీఆర్ ఇచ్చిన వివరణతో మరింత వేడెక్కాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ దొరల ఆస్తుల చిట్టాను రేవంత్ రెడ్డి బయటపెడుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

మరోవైపు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి పదేళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ చుట్టూనే తిరిగాయి. కేటీఆర్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఎదిగారు. కవిత కూడా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉండటంతో కేసీఆర్ కుటుంబం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది.

అదే సమయంలో కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, భూములు, కంపెనీలు, వ్యాపారాలపై కూడా చర్చ పెరుగుతూ వచ్చింది. ఎన్నికల అఫిడవిట్లలో నమోదైన వివరాలు చూస్తే.. 2014 తర్వాత కల్వ కుటుంబ సభ్యుల ఆస్తుల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. కేటీఆర్, ఆయన భార్య శైలిమ 2014లో ప్రకటించిన ఆస్తులు కలిపి దాదాపు రూ.8 కోట్లుగా ఉంటే.. 2018 నాటికి అవి రూ.41 కోట్లకు పైగా నమోదయ్యాయి. కేసీఆర్ ఆస్తుల్లోనూ ఇదే సమయంలో పెరుగుదల నమోదైంది.

అయితే ఈ ఆస్తుల వెనుక తన వ్యాపారాలే ఉన్నాయని కేటీఆర్ చెబుతున్నారు. రాజకీయాల్లోకి రాకముందే అమెరికాలో పనిచేశానని, అక్కడ సంపాదించిన డబ్బుతో వ్యాపారం ప్రారంభించానని, 2006 నుంచే హోటల్ రంగంలో ఉన్నానని ఆయన వివరణ. 2009 ఎన్నికల అఫిడవిట్‌లో తన పెట్టుబడుల వివరాలు కూడా వెల్లడించానని కేటీఆర్ చెబుతున్నారు.

మరోవైపు కేసీఆర్ కుటుంబంపై ఇంతకుముందు కూడా భూములు, ఫామ్‌హౌస్‌లు, వ్యాపార సంస్థల విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కుటుంబ సభ్యుల రాజకీయ ఎదుగుదలతో పాటు వారి ఆర్థిక వ్యవహారాలు కూడా రాజకీయ ప్రత్యర్థులకు ప్రధాన ఆయుధంగా మారాయి. 2023లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఈ ఆరోపణలు మరింత తీవ్రతరం అయ్యాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా భారీ ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఏడీఆర్ నివేదికల ప్రకారం 2022-23లో బీఆర్ఎస్ ప్రకటించిన ఆదాయం రూ.737 కోట్లకు పైగా ఉంది.

ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక ఆదాయం ప్రకటించిన పార్టీల్లో బీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక కేటీఆర్ 2009లో చెప్పిన ఆస్తులు, వ్యాపార వివరాలు.. ఆ తర్వాత 2014, 2018, 2023 ఎన్నికల అఫిడవిట్లలో నమోదైన ఆస్తులతో పోలిస్తే భూమికి ఆకాశానికి ఉన్నంత పోలిక ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదేకాకుండా అమెరికాలో ఆరేళ్లు పనిచేసి స్టార్ హోటళ్లు కట్టుకున్నాను, అవి క్రమేపీ మూడయ్యాయి, రాజకీయాల్లో లేకపోతే అవి పది అయ్యేవి, ఏం, పెళ్లాంపిల్లలకు బువ్వ పెట్టడానికి ఈమాత్రం వ్యాపారం చేస్తే తప్పేమిటని కేటీఆర్ ప్రశ్నించడం పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు..

ఆ సీక్రెట్ చెబితే భారతీయులు, నిరుద్యోగులు కూడా ఆరేళ్లు పనిచేసి మీలాగే కోట్ల ఆస్తులు కూడబెట్టుకుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక కొన్ని కంపెనీల్లో కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పాత్ర, డైరెక్టర్‌షిప్‌లు, పెట్టుబడులు, వాటి వెల్లడింపుపైనా సోషల్ మీడియాలో పలు పత్రాలు ప్రచారంలో ఉన్నాయి. వాటి నిజానిజాలు అధికారిక కంపెనీ రికార్డులు, ఎన్నికల అఫిడవిట్లో సమర్పించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. వీటిపై జరుగుతున్న పొలిటికల్ వార్ లో.. ఈ కుటుంబ ఆస్తుల పెరుగుదలను అక్రమ సంపాదనగా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు..

బీఆర్ఎస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. తన వ్యాపారాలు రాజకీయాల్లోకి రాకముందే ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఉద్యమం నుంచి అధికారంలోకి వచ్చింది. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపింది. ఆ పదేళ్లలో కేటీఆర్, కవిత రాజకీయంగా ఎదిగారు. కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు, ఆస్తులు కూడా ఊహించనంతగా పెరిగాయి.

అయితే గతంలో కవిత ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలు తెరమీదికి వచ్చాయి.. తాము డబ్బుకోసం చాలా కష్టపడ్డామని, రెంట్ కట్టడానికి కూడా సరిపడా అమౌంట్ లేదని.. ఒకగానొక దశలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కొత్తలో పార్టీని కూడా నడపాలంటే కష్టమైందని ఆమె చెప్పిన విషయలు తెలంగాణ ప్రజలు మరచిపోలేదు. అలాంటిది ప్రస్తుతం కల్వకుంట్ల కుటుంబం వేలకోట్ల ఆస్తులు కూడబెట్టుకోవడం వెనుక తెలంగాణ దోపిడి లేదా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి..

ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధాన ఆయుధంగా మారాయి. ఇది కేవలం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మాటల యుద్ధంగా ముగిసే వ్యవహారం కాదు. కేసీఆర్ కుటుంబం అధికారంలోకి రాకముందు ఉన్న ఆస్తులు.. అధికారంలో ఉన్నప్పుడు పెరిగిన ఆస్తులు.. వాటి వెనుక ఉన్న ఆదాయ వనరులు.. కంపెనీల్లో పెట్టుబడులు.. భూముల లావాదేవీలు.. ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించిన వివరాలు.. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.

కాబట్టి ఈ సమయంలో బీఆర్ఎస్ దొరలపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపి నిరూపించుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్క కేసీఆర్ వల్ల ప్రత్యేక తెలంగాణ ఏర్పడలేదన్నది జగమెరిగిన సత్యం.. రాష్ట్ర సాధనలో ఎందరో ఉద్యమకారులు తమ ప్రాణాలు పణంగా పెడితే.. వారి శవాలతో రాజకీయం చేసిన టీఆర్ఎస్.. తర్వాతి కాలంలో బీఆర్ఎస్ గా మారి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ఆశపడటం స్వార్థ రాజకీయాలకు నిదర్శనం కాదా అనే విమర్శలున్నాయి.

అలాగే తెలంగాణ ప్రజలను ఆశల పల్లకి ఎక్కించి గద్దెనెక్కిన నాయకులు, అమరుల ఆశయాలను పూర్తిగా విస్మరించారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన సాధించుకున్న రాష్ట్రంలో నేటికీ యువతకు, నిరుద్యోగులకు తగిన న్యాయం జరగలేదన్నది పచ్చి నిజం. ప్రజల ఆకాంక్షలను పక్కనబెట్టి, అధికారాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకున్నారనే ఆరోపణలపై ఇప్పుడు స్పష్టమైన ఆధారాలతో జవాబు చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.

ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని, ప్రజాగ్రహం ముందు ఏ శక్తులూ నిలబడలేవని చరిత్ర నిరూపించింది. ఇప్పటికైనా నిజాన్ని అంగీకరించి, తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా నిలవడమే నాయకత్వానికి ఉన్న ఏకైక మార్గం అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు.. కేటీఆర్ ఇస్తున్న సమాధానాలు.. ఈ రెండింటి మధ్య తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పాత కథే కొత్త రూపంలో కనిపిస్తోంది.

ఉద్యమ నాయకత్వం నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు కేసీఆర్ కుటుంబం ఎదిగిన తీరు ఒక అధ్యాయం అయితే.. అధికారంలో ఉన్న పదేళ్ల తర్వాత ఆ కుటుంబ ఆస్తులు, వ్యాపారాలపై జరుగుతున్న చర్చ మరో అధ్యాయంగా మారిందని అంటున్నారు. ఇక తెలంగాణ ప్రజలు అధికారాన్ని ఎవరికీ శాశ్వత హక్కుగా రాసివ్వలేదు... అమరుల త్యాగాల పునాదులపై తమ ఆకాంక్షలు నెరవేరుస్తారనే నమ్మకంతో ఇచ్చిన ఒక బాధ్యత మాత్రమే!

అహంకారంతో, గడీల పాలనతో బీఆర్ఎస్ ఎలాంటి ప్రజా తిరస్కారానికి గురైందో చూశాక కూడా... కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రజలను మోసం చేయాలని చూస్తే అదే గతి పడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార మదంతో అమరుల ఆశయాలను, ప్రజల నమ్మకాన్ని ఏ పార్టీ హేళన చేసినా... గద్దె దించడంలో రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరికీ మినహాయింపు ఇవ్వరని బీఆర్ఎస్ ను చూస్తే అర్థం అవుతుంది. అందుకే ప్రజాస్వామ్యంలో పాలకులకంటే ప్రజల తీర్పే ఆఖరిది... ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రజలకు జవాబుదారీగా పాలించడమే ఇరు పార్టీలకూ శ్రేయస్కరం అనే అభిప్రాయాలు ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి..

#Telangana#brs#ktr#kcr#kavitha#Congress#Allegations
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి