BJP: తెలంగాణ బీజేపీ నేతలపై రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థాగత నూతన ప్రధాన కార్యదర్శి మధుకర్ సీరియస్ అయ్యారు. వారికి క్లాస్ తీసుకున్నారు. రాష్ట్ర బీజేపీ పదాధికారుల (ఆఫీస్ బేరర్స్) సమావేశంలో నేతల తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ ఆఫీస్ చుట్టూ తిరగడం మానేసి జిల్లాల్లో పని చేయాలంటూ సూచించారు. పదవులు తీసుకుని ఏసీ రూముల్లో కూర్చుంటామంటే సరిపోదన్నారు. ఎవరి జిల్లాల్లో వారు ఉండాల్సిందేని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు.
ఇలా ఉంటే అధికారంలోకి ఎలా వస్తాం?
ఇక, క్రియాశీల సభ్యత్వం లేని వారికి కూడా రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఇచ్చారని.. ఇలా అయితే అధికారంలోకి ఎలా వస్తామని నేతలను వారు ప్రశ్నించినట్లు సమాచారం. ఇకపై మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదని.. కష్టపడే వారికే పదవులు ఉంటాయని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయడం లేదని నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు తప్ప అందరూ పార్టీ హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటున్నారని మండిపడ్డారు.
నేతల తీరుపై అసహనం
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశం వాడీవేడిగా జరిగింది. పదాధికారులు, జిల్లాల అధ్యక్షులు, జిల్లాల ఇంచార్జ్ లు, వివిధ సెల్స్ కు సంబంధించిన కన్వీనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అటు అభయ్ పాటిల్, ఇటు మధుకర్.. పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి వచ్చిన వారు కొందరు ఫోన్లలో మాట్లాడుకుంటూ కనిపించడంతో అభయ్ పాటిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరు జిల్లాల్లో పని చేయాల్సిందే
నేతలంతా కచ్చితంగా జిల్లాలకు వెళ్లి పని చేయాల్సిందే అని తేల్చి చెప్పారు. అప్పుడే బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఇక రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నూతనంగా వచ్చిన మధుకర్ సైతం మొదటి రోజే పార్టీ శ్రేణులకు క్లాస్ తీసుకున్నారు. పదవులు తీసుకుని ఏసీ రూముల్లో కూర్చుంటామంటే కుదరదన్నారు. ప్రతి ఒక్కరు జిల్లాల పర్యటనలు చేయాల్సిందేనన్నారు. రాష్ట్ర పదాధికారులతో సహా జిల్లాల అధ్యక్షులు, ఇంచార్జ్ లు తమకు అప్పగించిన ప్రాంతాల్లో పని చేయాల్సిందేనన్నారు.
నాయకుల పనితీరుపై రివ్యూ
క్రియాశీలక సభ్యత్వం లేని దాదాపు 30మంది నేతలకు రాష్ట్ర కమిటీలలో ఏ విధంగా పదవులు ఇచ్చారని మధుకర్ ప్రశ్నించారు. వెంటనే వారంతా క్రియాశీలక సభ్యత్వం తీసుకోకపోతే వారందరిని పదవుల నుంచి తొలగిస్తామన్నారు. నాయకుడు అనే ప్రతి ఒక్కరిని కలుపుకుని పోయే విధంగా ఉండాలి తప్ప స్వార్థంతో పని చేయడం కరెక్ట్ కాదన్నారు.
ప్రతి జిల్లా అధ్యక్షుడు తమ పరిధిలో ఉన్న ప్రతి మండలంలో తిరిగి రావాలన్నారు. నాయకులు ఎవరెవరు ఏయే పనులు చేశారు, వాళ్లకు అప్పగించిన పని పూర్తి కాకపోవడం గల కారణాలపై ఈ సమావేశంలో రివ్యూ చేశారు. ఇక, కొందరు పదాధాకారులు ఈ మీటింగ్ కు హాజరుకాకపోవడంపై అభయ్ పాటిల్, మధుకర్ లు సీరియస్ అయ్యారు. పార్టీ నేతల తీరుపై అభయ్ పాటిల్, మధుకర్ సీరియస్ అయిన వ్యవహారం బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.


