TG: రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో) డాక్టర్ స్వర్ణకుమారి కాసుల కక్కుర్తి పడి అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. మూతపడిన ఆసుపత్రిని రీ ఓపెన్ చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చే క్రమంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం సంచలనంగా మారింది.
రీ ఓపెన్ చేయడానికి రూ. 2 లక్షల బేరం
ఎల్‌బీనగర్ పరిధిలో సరైన లైసెన్స్ లేదనే కారణంతో ఇటీవల ఓ ఫిజియోథెరపీ హాస్పట్‌ని వైద్య శాఖ అధికారులు క్లోజ్ చేశారు. ఆసుపత్రిని మళ్లీ రీ ఓపెన్ చేయడానికి పర్మిషన్స్ జారీ చేయాలంటే రూ. 2 లక్షలు లంచం ఇవ్వాలని డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి డిమాండ్ చేశారు. అంత భారీ మొత్తం ఇచ్చుకోలేని సదరు ఆసుపత్రి యజమాని చివరకు తొలి విడతగా రూ.లక్ష ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే అధికారుల వేధింపులను భరించలేకపోయిన బాధితుడు, లంచం అడిగిన వీడియో ఎవిడెన్స్‌తో నేరుగా ఏసీబీని ఆశ్రయించారు.
బాధితుడి కంప్లైంట్‌తో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. శివరాంపల్లిలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో బాధితుడు తీసుకువచ్చిన రూ.లక్ష లంచం సొమ్మును హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తీసుకున్నారు. ఆయన వెంటనే ఆ మొత్తాన్ని డీఎంహెచ్‌వో డ్రైవర్ కృష్ణయ్యకు అందజేశారు. కృష్ణయ్య ఆ నోట్ల కట్టలను తీసుకువెళ్లి కారులో దాచేందుకు ప్రయత్నిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
డీఎంహెచ్‌వో సహా ముగ్గురు అరెస్ట్..
లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. డీఎంహెచ్‌వో డాక్టర్ స్వర్ణకుమారితో పాటు హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, డ్రైవర్ కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్నారు. లంచం డిమాండ్ చేసిన వీడియో ఎఫిడెన్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు, శివరాంపల్లి డీఎంహెచ్‌వో కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఉన్నతాధికారి హోదాలో ఉంటూ రూ.లక్ష లంచం తీసుకుంటూ డీఎంహెచ్‌వో అడ్డంగా బుక్కవడం ప్రభుత్వ శాఖల్లో కలకలం రేపుతోంది.


