BJP: ఉత్తరప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపికలో బీజేపీ హైకమాండ్ కేంద్ర మంత్రులకే షాక్ ఇచ్చింది. కేంద్ర కేబినెట్‌లో కీలక శాఖలు నిర్వహిస్తున్న హర్దీప్ సింగ్ పూరి, బన్వారీలాల్ వర్మ వంటి ప్రముఖులకు మళ్లీ ఛాన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టి, కొత్త వారికి అవకాశం కల్పించడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సిట్టింగ్‌లకు నో ఛాన్స్..
అక్టోబర్ 16న జరగనున్న ఎన్నికల కోసం కాషాయ దళం ప్రకటించిన ఎనిమిది మంది అభ్యర్థులలో ఒక్క సిట్టింగ్ ఎంపీ కూడా తిరిగి స్థానం దక్కలేదు. కేంద్ర మంత్రులతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీ డీజీపీ బ్రిజ్‌లాల్, సీమా ద్వివేదీ, నీరజ్ శేఖర్, గీతా శాక్య వంటి కీలక నేతల పదవీకాలం ముగుస్తున్నప్పటికీ వారిని పక్కన పెట్టారు.
రానున్న 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సామాజిక సమీకరణాలకు బీజేపీ పెద్దపీట వేసినట్లు కనిపిస్తుంది. ఓబీసీ, ఎస్సీ, అగ్రవర్ణాలతో పాటు మహిళలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపి కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గంగ్వార్‌లను బరిలోకి దించింది.
వారి రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ
హర్దీప్ సింగ్ పూరి, బీఎల్ వర్మల రాజ్యసభ పదవీకాలం నవంబర్‌తో ముగియనుండటంతో, వారిని తిరిగి పార్లమెంటుకు పంపేందుకు పార్టీ వేరే మార్గాలను చూస్తుందా లేక కేబినెట్‌లో మార్పులు చేయనుందా అన్నదిప్పుడు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ కేంద్ర మంత్రులు అయినా వారికి టికెట్లు ఇవ్వకుండా క్షేత్రస్థాయి కార్యకర్తలను పెద్దల సభకు పంపడం ద్వారా, పదవుల కంటే పార్టీ సిద్ధాంతం, సామాజిక సమీకరణాలే ముఖ్యమనే బలమైన మెసేజ్‌ను బీజేపీ నాయకత్వం క్షేత్ర స్థాయి క్యాడర్‌కి ఇచ్చినట్లు అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


