CaratLane: మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. క్యారెట్ లేన్ (Carat Lane) జువెలరీ షోరూమ్ లో దొంగలు పడ్డారు. సుమారు 3కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో షట్టర్ వంచి షాపులోకి చొరబడిన దుండగులు డైమండ్స్ తో పాటు బంగారు నగలు దోచుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పోలీసులు షోరూమ్ కి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
ఏడుగురు సభ్యుల ముఠా
ఈ కేసును సవాల్ గా తీసుకున్నారు పోలీసులు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ చోరీలో మొత్తం ఏడుగురు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. షోరూమ్ లోపలికి ఒకరు మాత్రమే వెళ్లారని, 5 నిమిషాల వ్యవధిలోనే దోపిడీ జరిగిందన్నారు. మిగతా వారంతా బయటే ఉండి కాపలా కాశారని వెల్లడించారు. దుండగులు ఎలా వచ్చారు, చోరీ తర్వాత ఏ మార్గంలో వెళ్లారు అనే వివరాల గురించి దర్యాఫ్తు చేస్తున్నారు.
6 నెలల క్రితమే షోరూమ్ ప్రారంభం
కాగా, క్యారెట్ లేన్ టాటా ప్రొడక్ట్ కు చెందిన జువెలరీ షాపు. 6 నెలల క్రితమే ఈ జువెలరీ షోరూమ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ షోరూమ్ లో 7 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు ఉంచినట్లు సమాచారం. దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయల విలువైన డైమండ్స్, బంగారు ఆభరణాలు పోయాయని సిబ్బంది తెలిపారు. దాదాపు 450 ఐటెమ్స్ చోరీ అయినట్లు తెలుస్తోంది.
పక్కాగా రెక్కీ చేసి చోరీ
ఈ చోరీ వెనుక అంతరాష్ట్ర ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా రెక్కీ నిర్వహించి ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని చెబుతున్నారు. దొంగలు చాలా తెలివిగా వ్యవహరించారు. ముందుగా వారు షట్టర్ కి సంబంధించి ఏర్పాటు చేసిన అలారం సిస్టమ్ కేబుల్ ని కట్ చేశారు. ఆ తర్వాత చోరీకి పాల్పడ్డారు.


