Rosi Reddy Arrest: ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మదిరాల రోసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో రోసిరెడ్డి పలువురి మోసగించినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. బోగస్ పత్రాలతో ప్లాట్ల విక్రయాలు చేసినట్లు మదిరాల రోసిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. జడ్చర్లలో ప్లాట్ పేరుతో ఒక వ్యక్తి నుంచి 25 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయకుండా రోసిరెడ్డి తప్పించుకుని తిరిగాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు ఆరా తీస్తే స్థలంపై హక్కులే లేవని వెల్లడైంది.
తన మోసాలు వెలుగులోకి రావడంతో రోసిరెడ్డి అలర్ట్ అయ్యాడు. ఆఫీసు మూసేసి పరారయ్యాడు. అతడి కోసం గాలించిన బంజారాహిల్స్ పోలీసులు చివరికి పట్టుకున్నారు. సీసీఎస్, జూబ్లీహిల్స్ సహా పలు పోలీస్ స్టేషన్లలో మదిరాల రోసిరెడ్డిపై గతంలోనూ చీటింగ్ కేసులు నమోదయ్యాయి. రోసిరెడ్డి బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రోసిరెడ్డి మోసాలపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
మదిరాల రోసిరెడ్డి దగ్గర జడ్చర్లలో ప్లాట్ కొన్న ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో తన స్థలం గురించి ఎంక్వైరీ చేయగా దిమ్మతిరిగే నిజం బయటపడింది. అది నకిలీ ప్లాట్ అని తేలింది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన నుంచి 25లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేశాడని రోసిరెడ్డిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు తనపై కేసు నమోదు చేసిన విషయం తెలియడంతో రోసిరెడ్డి పరారయ్యాడు. పరారీలో ఉన్న రోసిరెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. చివరికి పట్టుకున్నారు.


