తెలంగాణ

ఆకాశాన్ని అంటుతున్న సన్నబియ్యం ధరలు- రేవంత్ సర్కార్ ఏం చేస్తోందని హరీశ్ రావు ధ్వజం

రచన: NK••5 నిమిషాల పఠనం

నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దారుణం అని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ హరీశ్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యవేక్షణ వైఫల్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారని వాపోయారు.

* ఆకాశాన్ని అంటుతున్న సన్న బియ్యం ధరలు..

* రేవంత్ సర్కార్ నేల చూపులు

* నిత్యావసరాల ధరల నియంత్రణపై చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

* సామాన్యుడిపై పెను భారం పడుతుంటే మొద్దు నిద్రలో పౌరసరఫరాల శాఖ

* వెంటనే ధరల పెరుగుదలపై సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలి

* మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ హరీశ్ రావు డిమాండ్

Rice Prices: నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దారుణం అని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ హరీశ్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యవేక్షణ వైఫల్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారని వాపోయారు. సన్నబియ్యం ధరలు కేవలం నాలుగు నెలల్లోనే 25 శాతం పెరగడం ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం... మరి ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు తగ్గాల్సింది పోయి.. బియ్యం ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయి? అని నిలదీశారు.

సన్నబియ్యాన్ని ప్రజలు వినియోగించడం లేదు

''మీరు ఇస్తున్న సన్నబియ్యం పథకం సఫలం అయితే, ఎందుకు బియ్యం ధరలు అదుపు తప్పుతున్నాయి? మీరు ఇస్తున్న నాణ్యత లేని సన్నబియ్యాన్ని ప్రజలు వినియోగించడం లేదని చెప్పడానికి ఇది నిదర్శనం కాక మరేమిటి? ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నకు MSP పేరిట దక్కుతున్నది నామమాత్రపు ధర. కానీ మధ్య దళారులకు దక్కుతున్నది క్వింటాకు రూ.8000 పై మాటే. రైతుకు గిట్టుబాటు ధర లేదు. వినియోగదారుడికి అందుబాటు ధర లేదు. లాభపడుతున్నది మాత్రం మధ్య దళారులు? కళ్ళ ముందే ఈ తతంగం అంతా జరుగుతుంటే, ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదు?'' అని రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు నిప్పులు చెరిగారు.

ప్రజల జేబులు ఖాళీ అవుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర

బియ్యం మాత్రమే కాదు.. ఉల్లి కిలో 70, వెల్లుల్లి కిలో 240, పల్లి నూనె కిలో 210, పెసరపప్పు కిలో 125, కందిపప్పు రూ.165 ధరలు అడ్డగోలుగా పెరిగితే సామాన్య కుటుంబం ఎలా బతకాలి? వంటింటి బడ్జెట్ తారుమారవుతున్నా పౌరసరఫరాల శాఖ ఏం చేస్తోంది? ధరల పర్యవేక్షణ గాలికి వదలి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ప్రజల జేబులు ఖాళీ అవుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం కాదు.. వెంటనే చర్యలు తీసుకోవాలి.

బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక మార్జిన్లపై తక్షణం తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. సన్నబియ్యం సహా నిత్యావసరాల ధరలకు వెంటనే అడ్డుకట్ట వేసి, సామాన్యుడిపై పడుతున్న భారం నుండి ఉపశమనం కల్పించాలి'' అని హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

#Rice Prices#Brs#Telangana Congress#Cm Revanth Reddy#Harish Rao#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి