Telangana Congress: కాంగ్రెస్ సర్కార్ సామాజిక సమీకరణాల్లో అత్యంత వ్యూహాత్మక అడుగు వేయబోతున్నట్లు కనిపిస్తుంది. వచ్చే నెలలో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానికి తెలంగాణ తొలితరం ఉద్యమ రథసారథి, దివంగత ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డాక్టర్ పవిత్రవాణి పేరును హస్తం పార్టీ పరిశీలిస్తోందని జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం వైద్య వృత్తిలో సేవలందిస్తున్న ఆమెను పెద్దల సభకు పంపడం ద్వారా అటు ఉద్యమకారులకు, ఇటు బీసీ వర్గాలకు బలమైన సందేశం పంపాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోందట.
సిరిసిల్ల సభ వేదికగా ఇచ్చిన మాట..
గతంలో సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కీలక ప్రకటన చేశారు. చేనేత, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేతకు ఎమ్మెల్సీ స్థానం కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే దిశగా రేవంత్ వేగంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు.
రాజకీయంగా చైతన్యవంతమైన పద్మశాలి సమాజానికి సముచిత స్థానం కల్పించడం ద్వారా పార్టీ పట్టును మరింత బలోపేతం చేసుకోవచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణ కోసం మంత్రి పదవినే తృణప్రాయంగా వదిలేసిన పోరాట యోధుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీని ఉద్యమకారులు, బడుగు బలహీన వర్గాలు ఇప్పటికీ ఆరాధిస్తాయి. ఆయన కుటుంబ సభ్యురాలికి, అందులోనూ విద్యావంతురాలైన వైద్యురాలికి గుర్తింపు దక్కడం ద్వారా సర్కార్‌పై సానుకూల ప్రభావం పడుతుందని పార్టీ భావిస్తోంది.
గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన మూడు స్థానాల్లో ఒకదాన్ని ఈ విధంగా కేటాయించడం ద్వారా అటు ఉద్యమకారుల గుర్తింపుతో పాటు ఇటు బీసీ సంక్షేమ నినాదాన్ని కాంగ్రెస్ మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుని రాజ్ భవన్‌కు సిఫార్సుల జాబితాను పంపనున్నట్లు తెలుస్తుంది.


