TG: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సాగుతున్న లా పరీక్షల్లో వెలుగుచూసిన మాస్ కాపీయింగ్ బాగోతం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. సమాజానికి న్యాయాన్ని నేర్పించి, చట్టాన్ని కాపాడాల్సిన కాబోయే న్యాయవాదులే పరీక్ష హాల్స్‌లో అడ్డదారులు తొక్కుతూ పట్టుబడటం విస్మయానికి గురిచేస్తోంది. పకడ్బందీగా జరగాల్సిన పరీక్షల్లో జోరుగా సాగుతున్న చూచిరాతలు కేయూ పరువును బజారున పడేస్తున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్సర్ షీట్‌తో జంప్..
కేయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో ఇటీవల ఓ విద్యార్థిని కాపీ కొడుతూ అడ్డంగా ఇన్విజిలేటర్‌కు దొరికిపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన పని మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆన్సర్ షీట్‌ను లాక్కొని ఏకంగా పరీక్ష హాల్ నుంచే ఉడాయించింది. ఈ ఘటనతో లా పరీక్షల నిర్వహణలో డొల్లతనం ఒక్కసారిగా బట్టబయలైంది. మరోవైపు భీమారంలోని అరుణోదయ కాలేజీ సెంటర్‌లో కేయూ లా కాలేజీ, ఆదర్శ, ఎంజేపీ కళాశాలల విద్యార్థులు పుస్తకాలు, చిట్టీలు, స్మార్ట్‌ఫోన్లు ముందేసుకుని మరీ బహిరంగంగా కాపీయింగ్‌కు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
చేతులు తడిపితే చాలు.. 'అంతా ఓకే'
ఈ మాస్ కాపీయింగ్ వెనుక భారీ మతలబు నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఇన్విజిలేటర్లు చేతులు తడిపి కాపీయింగ్‌కు పూర్తి సహకారం అందిస్తున్నారని, స్క్వాడ్ తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్లు డ్రామాలు ఆడుతున్నారని తోటి విద్యార్థులు మండిపడుతున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివేవారి భవిష్యత్తును కొందరు అక్రమార్కులు సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు కాపీయింగే జరగడం లేదని ఒకవైపు బుకాయిస్తూనే.. మరోవైపు ఏకంగా 30 మందిని డిబార్ చేశామని వర్సిటీ అధికారులు ఒప్పుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం అని అంటున్నారు. న్యాయ వ్యవస్థలోకి వెళ్లాల్సిన విద్యార్థులే ఇలాంటి దొంగదారుల్లో డిగ్రీలు అందుకోవాలని చూడటంపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ మాస్ కాపీయింగ్‌పై విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.


