TG: హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన సంచలన ఆరోపణలను తెలంగాణ జైళ్ల శాఖ తీవ్రంగా ఖండించింది. చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ రూ. 2 కోట్ల లంచం తీసుకుని నిందితుడికి బెయిల్ ఇప్పించారంటూ ఒవైసీ చేసిన కామెంట్స్‌లో ఎలాంటి వాస్తవం లేదని తెలంగాణ జైళ్ల శాఖ స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడి విడుదలకు సంబంధించి జరుగుతున్న ప్రచారానికి అధికారులు అఫీషియల్‌గా తెరదించారు.
బెయిల్ ఇచ్చే అధికారం కోర్టులదే.. మాకేం సంబంధం?
చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై వచ్చిన ఆరోపణలపై జైళ్ల శాఖ అధికారులు సూటిగా స్పందించారు. "ఏదైనా కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసే అధికారం కేవలం కోర్టులకు మాత్రమే ఉంటుంది. లా ప్రకారం సంబంధిత న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేస్తేనే జైలు నుంచి విడుదల చేస్తాం. ఇందులో జైలు అధికారుల ప్రమేయం గానీ, బెయిల్ ఇచ్చే విచక్షణాధికారం గానీ ఉండదు. రూల్స్ ప్రకారం కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాతే ఖైదీని విడుదల చేశాం తప్ప, లంచం తీసుకుని బయటకు పంపే ప్రశ్నే తలెత్తదు" అని అధికారులు స్పష్టం చేశారు.
ఆ ప్రచారంలో నిజం లేదు!
జైలు ప్రాంగణంలో హంతకులంతా కలిసి పంచాయతీ పెట్టారని, ఎంఐఎం నేతలపై దాడులకు ప్లాన్ చేస్తున్నారంటూ ఒవైసీ చేసిన కామెంట్స్‌పై కూడా జైళ్ల క్లారిటీ ఇచ్చింది. చంచల్‌గూడ జైలులో నిరంతరం కట్టుదిట్టమైన నిఘా, సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుందని.. ఖైదీలు కుట్రలకు ప్లాన్స్ చేసేందుకు ఎలాంటి ఆస్కారం లేదని తేల్చిచెప్పింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఆధారాలు లేని ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంది.
అసలు ఒవైసీ ఏమన్నారంటే..
హైదరాబాద్ మీలాద్ మైదాన్‌లో జరిగిన 'జల్సా-ఎ-మిలాద్-ఉన్-నబి' సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. అడ్వొకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులోని ప్రధాన నిందితుడు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు రూ. 2 కోట్ల లంచం ఇచ్చి బెయిల్‌పై బయటకు వచ్చాడని ఆరోపించారు. జైలులోనే హంతకుల పంచాయతీ నడిపి, మజ్లిస్ నాయకులే టార్గెట్‌గా కుట్రలు పన్నుతున్నారని తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కాగా, జైళ్ల శాఖ ఇచ్చిన తాజా క్లారిటీతో వీటికి ముగింపు పలికినట్లు అయ్యింది.












