Kodanda Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) అధికారులు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాఫ్తులో కోదండరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీంతో అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు.
40 నిమిషాలకుపైగా విచారణ.. స్టేట్‌మెంట్ రికార్డ్
దాదాపు 40 నిమిషాలకు పైగా అధికారులు కోదండరెడ్డిని సాక్షిగా విచారించారు. పలు అంశాలపై ప్రశ్నించి ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. ఈ స్టేట్ మెంట్ ఆధారంగా ఈ కేసులో మరికొందరు కీలక వ్యక్తులకు సిట్ నోటీసులు జారీ చేసి విచారించే అవకాశముందని తెలుస్తోంది. 2023 ఎన్నికల సమయంలో కోదండరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
లీడర్లు, వ్యాపారులు, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సిట్ దర్యాఫ్తులో తేలింది. ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు, జడ్జిలు, సెలబ్రిటీల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. దర్యాఫులో భాగంగా సిట్ బృందం పలువురిని విచారించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వంటి సీనియర్ పోలీసు అధికారులు కీలక పాత్ర పోషించినట్లు సిట్ తమ విచారణలో గుర్తించింది.
తుది చార్జిషీట్ సిద్ధం..
రేవంత్‌రెడ్డి ఎంపీగా, పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో పలుమార్లు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారు. తన ఫోన్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపించారు. 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్య మొత్తం 4,013 మందిపై ఎస్‌ఐబీ నిఘా ఉంచినట్లు.. వీరిలో 618 మంది సంభాషణలను రికార్డ్ చేసినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగానే ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును ప్రశ్నించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా వందల మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కేసులో ప్రభాకర్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును సైతం నిందితులుగా చేర్చారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తుది చార్జ్‌షీట్‌ను సిద్ధం చేసింది.


