Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఊహకందని పరిణామం దిశగా చర్చలు మొదలయ్యాయా? ఉదయం లేస్తే నువ్వా - నేనా అంటూ కత్తులు దూసుకునే కాంగ్రెస్ - బీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడి శత్రువుపై పోరాటానికి ఒకే గూటికి చేరబోతున్నాయా? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని నిజం చేస్తూ ఈ రెండు బద్ధ వ్యతిరేక శక్తులు చేతులు కలపడానికి రంగం సిద్ధమవుతోందా? ప్రస్తుతం గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్ వరకు.. రాజకీయ విశ్లేషకుల నుంచి సామాన్య ప్రజల వరకు ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది.
వివాదానికి ఆజ్యం పోసిన 'ఓటర్ల సవరణ' పంచాయితీ
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్) చుట్టూ ముసురుకున్న వివాదమే ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది. తెలంగాణలో పెద్ద ఎత్తున అర్హులైన ఓట్లను గంపగుత్తగా తొలగిస్తున్నారని, బూత్ లెవల్ ఏజెంట్ల వ్యవహారం నుంచి డ్రాఫ్ట్ లిస్ట్ వరకు ప్రతి దశలోనూ ఎన్నికల సంఘం ఏకపక్షంగా వెళ్తోందని అధికార కాంగ్రెస్ బహిరంగంగానే మండిపడుతోంది. కేంద్రంలోని బీజేపీ పెద్దల కనుసన్నల్లోనే ఈ తంతు నడుస్తోందని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా లోక్‌భవన్ల ముట్టడికి ఏఐసీసీ సిద్ధమైంది. అటు రాష్ట్రంలోనూ బీజేపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు ఓట్ల గల్లంతుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.
శత్రువుకు శత్రువు మిత్రుడు కాబోతున్నాడా
ఈ వివాదంపై పోరాటానికి కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా గాంధీభవన్‌లో రౌండ్ టేబుల్ భేటీకి పిలుపునిచ్చింది. సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అయ్యింది. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకుపోతున్న కాంగ్రెస్ నాయకత్వం.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌కు ఆహ్వానం పంపుతుందా? ఒకవేళ ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓట్ల హక్కు పేరిట కాంగ్రెస్ నుంచి పిలుపు అందితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సానుకూలంగా స్పందిస్తారా? అన్న సమీకరణాలు ఇప్పుడు ఊపందుకున్నాయి. ఓట్ల తొలగింపు జరిగితే కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో.. తాత్కాలికంగానైనా ఉమ్మడి పోరాటం చేస్తారా అన్న ప్రచారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకుంది.
అడుగులు కలిసేనా.. అసాధ్యమేనా
జోరుగా సాగుతున్న ఈ ప్రచారానికి, క్షేత్రస్థాయి వాస్తవాలు మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో అధికారం కోల్పోయిన కసిలో బీఆర్ఎస్ ఉండగా.. గులాబీ పార్టీని రాజకీయంగా నామరూపాలు లేకుండా చేయాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. పైగా తెరవెనుక బీజేపీ - బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఇప్పటికే హస్తం నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓట్ల సవరణ అంశం ఎంత కీలకమైనప్పటికీ, రెండు పార్టీలు ఒక్కటై పోరాడటం దాదాపు అసాధ్యమని పొలిటికల్ పండిట్స్ తేల్చేస్తున్నారు. అయితే ఊహించని మలుపులకు వేదికైన తెలంగాణ పాలిటిక్స్‌లో.. ఈ 'చేతులు కలిపే' చర్చ రాబోయే రోజుల్లో ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.


