Anurag Kashyap: బాలీవుడ్ సహా ఇతర సౌత్ భాషల్లోని సీనియర్ స్టార్స్ మన తెలుగు సినిమాలలో మంచి పాత్రల్లో నటించి ఇక్కడ ప్రేక్షకుల్లో ఆదరణను దక్కించుకుంటున్నారు..ఈ విషయం, అందరికీ తెలిసిందే. కానీ, దర్శకులు అంతగా మన తెలుగు చిత్రాలలో నటిస్తున్నది చాలా అంటే చాలా తక్కువ. అయితే, ఈ మధ్య అడవి శేష్ నటించిన 'డెకాయిట్' సినిమాతో తెలుగులో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్. ఇప్పుడు, మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ అందుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ చిత్రాల్లో మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న కాకా చిత్రం ఒకటి. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తోంది. 'అమ్ములు పాప'గా అనస్వర చిరుకి కూతురుగా ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందని యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం. గెటప్ శీను, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవల, ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ లో వీళ్ళు మాత్రమే కనిపించారు. దీంతో, అసలు 'కాకా' సినిమాలో క్రేజీ స్టార్ కాస్టింగ్ ఉందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. చిరంజీవి సినిమా అంటే అందరు ముందు చర్చించుకునేది హీరోయిన్ గురించి.. ఆ తర్వాత విలన్ గురించి. వీరికి సంబందించిన ఇన్‌ఫర్మేషన్ ఏదీ ఇప్పటి వరకూ బాబీ లీక్ చేయలేదు. ప్రాజెక్ట్ స్టార్ట్ అవకముందు నుంచి కూడా మెగాస్టార్‌కి జంటగా నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి నటించనుందని ప్రచారం జరిగింది.
ఈ మధ్యనేమో స్నేహ పేరు వార్తల్లో నిలిచింది. వీరికి సంబందించిన అప్‌డేట్ ఏదీ రాలేదు గానీ, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ నటిస్తున్న విషయం మాత్రం రివీల్ అయింది. 'డెకాయిట్' లో పోలీస్ ఆఫీసర్‌గా మంచి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు అనురాగ్. ఆ తర్వాత, మళ్ళీ నటిస్తున్న సినిమా 'కాకా'. ఇందులో, ఆయన ఎలాంటి పాత్రను పోషిస్తున్నారో ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. బాబీ పక్కన కూర్చుని అనురాగ్ కి సీన్స్ వివరిస్తున్న పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి..మూవీలోకి ఆయన వచ్చినట్టుగా దర్శకుడు బాబీ కన్‌ఫర్మ్ చేశాడు. ఇక, ఈ సినిమా 2027, సంక్రాంతికి బరిలోకి దిగుతోంది.


