TG: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే పదవి కోల్పోవడం, స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ గెజిట్ రిలీజ్ చేయడం, అటు విజయారెడ్డి కోర్టు పిటిషన్లతో ఉపఎన్నికల ఉత్కంఠ పతాక స్థాయికి చేరిన వేళ.. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన తాజా కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తనపై అనర్హత వేటు పడటంపై ఆయన స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు.
అఫిడవిట్ వల్ల కాదు.. పార్టీ నిర్ణయంతోనే ఇదంతా
ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చానన్న ఆరోపణల కారణంగా తనపై అనర్హత వేటు పడలేదని దానం నాగేందర్ కుండబద్దలు కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన అనంతరం, మారిన రాజకీయ సమీకరణాలతో మరో పార్టీ తరఫున బరిలోకి దిగడం వల్లే టెక్నికల్‌గా ఈ డిస్‌క్వాలిఫికేషన్ ఎదురైందని స్పష్టం చేశారు. "ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు.. పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకే నేను పోరాటం చేశాను" అంటూ ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలను ఆశ్చార్యానికి గురిచేస్తున్నాయి.
విజయారెడ్డి పిటిషన్.. బైపోల్ ఆగుతుందా
మరోవైపు ఖైరతాబాద్ సీటు ఖాళీ అయినట్లు అసెంబ్లీ గెజిట్ వెలువడటంతో ఉపఎన్నిక అనివార్యమనే చర్చ జోరందుకుంది. అయితే కాంగ్రెస్ నాయకురాలు పి.విజయారెడ్డి గతంలోనే హైకోర్టును ఆశ్రయించడం ఈ వ్యవహారాన్ని మరింత క్లిష్టంగా మార్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో దానం నాగేందర్ సరైన వివరాలు ఇవ్వలేదని, ఆయన ఎన్నికను రద్దు చేసి రెండో స్థానంలో నిలిచిన తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఉపఎన్నిక నిర్వహించవద్దని కూడా ఆమె న్యాయస్థానాన్ని కోరారు.
ఈ పిటిషన్‌పై స్పందించిన దానం నాగేందర్.. విజయారెడ్డి వేసిన కేసుపై గతంలోనే తాను కోర్టులో సమగ్రమైన అఫిడవిట్ దాఖలు చేశానని గుర్తుచేశారు. ఒకవైపు కోర్టు తీర్పుపై ఉత్కంఠ, మరోవైపు ఉపఎన్నిక తప్పదన్న సంకేతాల నడుమ దానం చేసిన "ముందే తెలుసు" అన్న కామెంట్స్ ఖైరతాబాద్ పాలిటిక్స్‌ను మరింత హీటెక్కించాయి.


