సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో వేడెక్కిన వివాదం..
హస్తినలో కాంగ్రెస్ కీలక భేటీ..
పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ వరకు విపక్ష ఎంపీల మార్చ్
ఢిల్లీలో టెన్షన్ టెన్షన్
ఢిల్లీ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఈసీ పనితీరు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంపై ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న విపక్షాలు.. ఇప్పుడు నేరుగా ఎన్నికల సంఘం కార్యాలయం వైపు కదలనున్నాయి. మరికొద్ది గంటల్లో పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు విపక్ష ఎంపీలు ‘ఛలో ఈసీ’ నిర్వహించనున్నారు.
ఈ ఆందోళనకు ఒక రోజు ముందు సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో ఈసీ మార్చ్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది.
సుప్రీంకోర్టులో ఏం జరిగింది?
ఈసీ వినియోగిస్తున్న ఫామ్-6లో చేసిన మార్పులపై సోమవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాము ఎలాంటి మార్పులను ఆమోదించలేదని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అంతేకాదు.. ఆ మార్పులు ఎవరు చేశారో తెలుసుకునేందుకు రికార్డులు పరిశీలించాల్సి ఉందని కోర్టు పేర్కొంది.
ఇదే అంశాన్ని విపక్షాలు ఇప్పుడు తమ ప్రధాన అస్త్రంగా మార్చుకుంటున్నాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ సహా విపక్ష నేతలు ఈసీపై మరింత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ.. ఫామ్-6లో మార్పులు ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా జరిగాయని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఈసీ తిరస్కరిస్తోంది.
కాంగ్రెస్ కీలక సమావేశం.. పోరాటం మరింత విస్తరణ
ఇదే సమయంలో కాంగ్రెస్ సోమవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా పార్టీ ముఖ్య నేతలు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ ‘వోట్ బచావో.. దేశ్ బచావో’ పేరుతో దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. అక్టోబర్ 10 నుంచి ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది. నవంబర్ 1న ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించింది. ఈసీపై పోరాటాన్ని ఒక్కరోజు నిరసనగా ముగించకుండా.. దీర్ఘకాలిక రాజకీయ ఉద్యమంగా మార్చే వ్యూహాన్ని కాంగ్రెస్ సిద్ధం చేస్తోందన్నమాట.
పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు..
ఇక ఇవాళ జరగనున్న ‘ఛలో ఈసీ’పై ఉత్కంఠ నెలకొంది. విపక్ష ఎంపీలు పార్లమెంట్‌లోని మకర్ ద్వార్ వద్ద సమావేశమై అక్కడి నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఉన్న నిర్వచన్ సదన్ వైపు మార్చ్ చేయనున్నారు. ఉదయం సుమారు 10.30 గంటలకు మార్చ్ ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు కాంగ్రెస్ తెలిపింది. SIRలో అవకతవకలు, ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, ఈసీ నిర్ణయాలపై పారదర్శకత, CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వంటి అంశాలను విపక్షాలు ప్రధానంగా లేవనెత్తనున్నాయి.
అయితే ఈ మార్చ్‌ను పోలీసులు ఎంతవరకు అనుమతిస్తారు? పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు విపక్ష ఎంపీలను అడ్డుకుంటారా? ఒకవేళ ఆపితే అక్కడే ఆందోళన ఉధృతమవుతుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విపక్షాల ఐక్యతకు ‘ఛలో ఈసీ’ పరీక్ష!
సెప్టెంబర్ 30న జరిగిన విపక్ష పార్టీల సమావేశంలోనే అక్టోబర్ 6న ఈసీ కార్యాలయానికి మార్చ్ చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ తదితర విపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ మార్చ్‌లో పాల్గొనడం లేదని సోమవారం స్పష్టం చేసింది. దీంతో ‘ఛలో ఈసీ’ కేవలం ఈసీపై నిరసన మాత్రమే కాదు.. విపక్షాల ఐక్యతకు కూడా ఒక పరీక్షగా మారుతోంది.
ఈసీ వాదన ఏంటి?
మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం SIR ప్రక్రియ రాజ్యాంగబద్ధమైన అధికారాల పరిధిలోనే జరుగుతోందని చెబుతోంది. ఓటర్ల జాబితా సవరణలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించడం లక్ష్యం కాదని.. అభ్యంతరాలు, క్లెయిమ్‌లకు అవకాశం ఉందని ఈసీ ఇప్పటికే వివరణ ఇచ్చింది. విపక్షాలు చేస్తున్న పలు ఆరోపణలను కూడా ఈసీ తిరస్కరిస్తోంది.
నేటి.. మార్చ్‌తో ఏం జరగబోతోంది?
ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ వైపే. పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు విపక్ష ఎంపీల మార్చ్.. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల తర్వాత మరింత పదునెక్కిన రాజకీయ పోరాటం.. కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతుండటం.. ఇవన్నీ చూస్తుంటే ఈసీ వర్సెస్ విపక్షాల వివాదం ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు.
ఛలో ఈసీతో ఈ పోరాటం ఏ మలుపు తిరుగుతుంది? విపక్షాలు ఈసీ కార్యాలయం వరకు చేరుకుంటాయా? కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై ఎలా స్పందిస్తుంది? సుప్రీంకోర్టు ముందు ఉన్న కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ కలిపి చూస్తే.. ఛలో ఈసీ కేవలం ఒక నిరసన కాదు.. రాబోయే రోజుల్లో మరింత పెద్ద రాజకీయ పోరాటానికి ప్రారంభ సంకేతంగా మారే అవకాశం కనిపిస్తోంది.












