ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఉద్యోగాల భవిష్యత్తుపై ఆందోళనలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీల్లో లేఆఫ్ ప్రకటనలతో ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఈఎంఐల భారంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఏఐ ప్రభావంపై నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థివేత్త డాలరన్ అసెమోగ్లు కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా ప్రస్తుతం పయనిస్తున్న విధానంలోనే AI విస్తరణ కొనసాగితే, రాబోయే పదేళ్లలో అక్కడ నిరుద్యోగం ఏకంగా మూడు రెట్లు పెరిగే అవకాశముందని ఆయన హెచ్చరించారు. గతంలో పారిశ్రామిక విప్లవం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి 80ఏళ్లు పడితే, నేటి AI మార్పులు కేవలం ఏడాది లేదా రెండేళ్లలోనే చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
CBS '60 మినిట్స్' ఇంటర్వ్యూలో అసెమోగ్లు మాట్లాడుతూ.. ఏఐ శిక్షణ ప్రాసెస్ (డేటా మోడలింగ్) వల్ల కొన్ని కొత్త ఉద్యోగాలు వస్తున్నప్పటికీ, ఆటోమేషన్ కారణంగా పోయే ఉద్యోగాల సంఖ్యతో పోలిస్తే ఇవి చాలా స్వల్పమని స్పష్టం చేశారు. యంత్రాలు, టూల్స్ వేగంగా పనులు పూర్తి చేయడంతో కంపెనీలు తక్కువ మంది సిబ్బందితో పనులు కానిచ్చేస్తున్నాయని తెలిపారు.
ప్యూరీసెర్చ్ (Pew Research) అధ్యయనం ప్రకారం దాదాపు 75శాతం మంది అమెరికన్లు ఏఐ తమ ఉద్యోగాలను భర్తీ చేస్తుందేమోనని భయాందోళనకు గురవుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. సేల్స్‌ఫోర్స్, మెటాల వంటి దిగ్గజ సంస్థల AI విభాగ మాజీ హెడ్ క్లారా షిహ్ కూడా ఈ సమస్య తీవ్రతపై స్పందించారు. ఉద్యోగం కోల్పోవడం అనేది కేవలం జీవనోపాధిని కోల్పోవడమే కాకుండా, ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని, సమాజంలో ఉన్న సమతుల్యతను దెబ్బతీస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.
వైట్‌కాలర్, ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలపై ఏఐ చూపుతున్న ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని, ఇది రాబోయే రోజుల్లో సమాజంలో పెద్ద మార్పులకు దారితీస్తుందని షిహ్ పేర్కొన్నారు. టెక్నాలజీని ఆపడం దీనికి పరిష్కారం కాదని, AI ని ఉద్యోగుల తొలగింపునకు కాకుండా వారి సామర్థ్యాలను పెంచే సాధనంగా ఉపయోగించేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలని అసెమోగ్లు సూచించారు. సాంకేతిక అభివృద్ధి వల్ల సామాన్యుడు తీవ్రంగా నష్టపోకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే కంపెనీలకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని సూచించారు.


