- వందలాది ఫిర్యాదులు.. అయ్యప్ప సొసైటీలో బుట్ట అరాచకాలు ఎన్నో?
- టాటా కార్ల షోరూం పేరుతో దోచుకునుడే పని?
- సిస్టమ్‌పై నియంత్రణ లేదు.. కస్టమర్ అంటే విలువ లేదు?
- ఈవీ వెహికిల్స్, బాడీ షాప్‌కి వాహనాలు వస్తే పండగే?
- దోచుకోవడం.. పట్టించుకోకపోవడం.. ప్రశ్నిస్తే మీ వాహనం బ్లాక్ లిస్టులో ఉందంటూ బ్లాక్ మెయిల్?
- భూ కబ్జాల మాదిరిగానే మిగితా వ్యవస్థలను నడిపిస్తున్నారా?
- బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టినంత ఈజీగా బిజినెస్ చేయొచ్చు అనుకుంటున్నారా?
- ఒక్కొక్కరుగా నిలదీస్తున్న బాధితులు
స్వేచ్ఛ న్యూస్, హైదరాబాద్
నిషేధిత భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా, అయ్యప్ప సొసైటీలో మాజీ ఎంపీ బుట్ట రేణుక, అమె భర్త నిర్వహిస్తున్న వ్యవహారాలు అన్నీ ఇన్ని కావు. భవంతులకు ఎలాంటి అనుమతులు లేకుండానే స్కూల్స్ , కన్వెన్షన్స్, షోరూమ్స్ నడిపిస్తున్నారు. లంచాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. గురుకుల్ ట్రస్ట్ భూములు, రాయదుర్గం భూములను చెర బట్టేలా ఆలోచించిన ఈ కుటుంబానికి, ఇప్పటికే రాయదుర్గంలో ప్రభుత్వ అప్రమత్తతతో ఎదురుదెబ్బలు తగిలాయి.
తాజాగా మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నిర్వహిస్తున్న నిర్మాణాలతో పాటు, బిజినెస్‌లలో అదే రౌడీఇజం చూపిస్తున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. కార్ల షోరూంలో కనీసం రెస్పాన్స్ లేదని వాపోతున్నారు. ఒక్కసారి షోరూం, సర్వీస్ సెంటర్‌కి వెళితే ఒక్కొక్కరి బాధ ఒక్కో రకంగా ఉంటోంది. ఎవరైనా టాటా కంపెనీకి ఫిర్యాదు చేస్తే, ఎందుకు చేశారని, మీరు ఇంకోసారి ఈ షోరూంకి రాకుండా బ్లాక్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా బాధితుల ఒక్కొక్కరి బాధ ఒక్కో రకంగా ఉంది. దేశీయ ఉత్పత్తులను ప్రొత్సహించాలని టాటా కార్లను తీసుకుంటుంటే, బస్తీలో ఉండే పిల్లలను తీసుకొచ్చి సర్వీస్ పనుల్లో పెట్టుకున్నట్లు అనేక మంది వాపోతున్నారు.
టాటా సర్వీస్‌లపై సర్వత్రా విమర్శలు.. ఈవీ వాహనాలను ప్రోత్సహించడమే కాదు.. సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు చేయండి
గాంధీ జయంతి రోజు హాలిడే అని తెలుసు. కానీ, ఆ రోజు బుకింగ్స్ తీసుకున్నారు. షోరూంకి వెళ్లిన 70 మంది కస్టమర్స్ మళ్లీ వెనుదిరిగారు. మిగతా షోరూమ్స్‌లో పికప్ , డ్రాపింగ్‌లు ఉంటాయి. ఇక్కడ అలాంటివి ఎవీ కనిపించవు. అయినా అడ్జెస్ట్ అవుతున్నారు. ఈవీ వాహానాలను పరిశీలించాల్సిన టీం చేతులు ఎత్తేస్తోంది. సర్వీస్ చేయడం చేతకాని తీరుతో కస్టమర్స్‌పై రూబాబ్‌గా మాట్లాడుతున్నారు.
ఎవరైనా టాటా కంపెనీకి ఫిర్యాదు చేస్తే ఇక అంతే సంగతులు. వాళ్ల కార్లను 20 రోజులైనా ఇవ్వరు. ఇన్సూరెన్స్ క్లైం కాకుండా చేస్తారు. అదనంగా 30 నుంచి 40 వేలు దోచుకుంటారు. ఇలా అనేక లీలలు. ప్రజా సేవలో, ఒక రాజకీయ నేతగా ఉండే బుట్ట రేణుక షోరూంలలో ఇదంతా చోటు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సీబీఐ కేసులు అయితే ఏం చేశారు? భూములు కొల్లకొడితే ఏం చర్యలు ఉన్నాయి? ఇప్పుడు ఈ బిజినెస్ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఏం చేస్తారనే ధీమాతో హైదరాబాద్ పబ్లిక్‌ని మోసం చేస్తున్నారు. హైటెక్ సిటికి దగ్గరలో ఉన్నందున డిమాండ్ ఉందనే ధీమాతో కస్టమర్స్ అంటే విలువ లేకుండా పోయింది. అన్ని ఆధారాలతో సోషల్ మీడియాలో తేజస్వీ టాటా మోటార్స్ వ్యవహారంపై ఆందోళన కలిగించే విధంగా బాధితులు పోస్టులు పెడుతున్నారు.
ఫిర్యాదులు చేయొద్దట.. ఎంతో మంది ఆవేదన!
అక్టోబర్ 2న సర్వీసింగ్‌కి అపాయిట్మెంట్ ఇచ్చిన కారు అంతకంటే ముందే ఔటర్ రింగ్ రోడ్డు మీద ఛార్జింగ్ డ్రాప్ అయి బ్రేక్ డౌన్ అయింది. ఆ వాహనాన్ని రోడ్డు సైడ్ అసిస్టెంట్‌కి డబ్బులు చెల్లించినా, తమకు తెలియదని రూ.3 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వాహనాన్ని అక్టోబర్ 1న తీసుకొచ్చి షోరూంలో పార్క్ చేశారు. 2వ తేదీ సర్వీస్ అపాయింట్మెంట్‌కు వెళ్లినా ఎవరూ లేరు. ఆ తర్వాత ఫోన్ చేసినా మీ కారుకు సర్వీస్ అవసరం లేదని చెప్పారు. 3, 4 తేదీల్లో ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు.
దీనికి తోడుగా కనీసం చార్జింగ్ పెడితే ప్రాబ్లం తెలుస్తుందని అడిగినా పెట్టలేదు. దీంతో అక్టోబర్ 4న వాళ్ల రెస్పాన్స్‌పై కస్టమర్ ఫిర్యాదు చేశాడు. ఆ రాత్రి చార్జింగ్ పెట్టారు. 5వ తేదీన సర్వీస్ సెంటర్‌కి వెళితే ఫిర్యాదు చేసిన కస్టమర్ వచ్చారని సర్వీస్ మేనేజర్ నాగరాజుతో పాటు, శ్రీనివాస్ రావు మిగితా సిబ్బంది ఏకమై, నువ్వు ఎలా కంప్లైయిట్ చేస్తావని ఎగిరారు. మీరు చార్జింగ్ డబ్బులు కట్టి వాహనాన్ని తీసుకెళ్లండి అని సలహాలు ఇచ్చారు.
ఎందుకు సర్వీస్ చేయరని అడిగితే, ఇంకా టైం కాలేదని దాటవేశారు. దీంతో ఆగకుండా ఎందుకు డ్రాప్ అవుతుందని అడిగితే మరో 15 రోజులు ఇవ్వండి అప్పుడు ఆలోచిస్తామని నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. అప్పుడే చార్జింగ్ ఫీజ్ గురించి కస్టమర్ అడిగినందుకు ఈ కార్‌ను బ్లాక్ లిస్టులో పెట్టండి, ఫిర్యాదు చేసినా ఈ కస్టమర్ ఇంకోసారి రావొద్దు అంటూ చిందులు తొక్కారు. చార్జింగ్ డబ్బులు అంటూ వసూలు చేసినవి రూ.503. దాన్ని జనరల్ చెకప్ కింద రాశారు.
ఒక్క ఈవీ కార్ల షోరూంలో కనీసం చార్జింగ్ పెట్టుకోలేనంత దౌర్బగ్యం ఉందంటే ఎందుకు ఈ ఈవీ వాహానాలు అని కస్టమర్లు నిలదీస్తున్నారు. ఇలా ఒక్క కస్టమర్ కాదు. అనేక మందిని బ్లాక్ మెయిల్ చేసి, యాక్సిడెంట్స్ వాహనాల వద్ద నుంచి పెద్ద మొత్తంలో దోచుకుంటున్నారు. ఇన్సూరెన్స్ రాదని, క్లైం కాదని ప్రైవేట్‌గా ఫోన్ పేలు చేయించుకుంటున్నారు.
మేడం.. మీలానే మీ సిబ్బంది ఉంటే ఎలా?
మీరు, మీ కుటుంబం ఎక్కడెక్కడ భూములు కబ్జాలు పెట్టారు. ప్రభుత్వంలో ఉన్న లోసుగులను వాడుకొని రాయదుర్గంతో పాటు ఇతర ఏరియాల్లో ఏం చేశారో గతంలో స్వేచ్ఛ న్యూస్ రాసిన వార్తలు చదివామని బాధితులు తెలిపారు. అయ్యప్ప సొసైటీలో ఏం జరుగుతుందో అందరి కళ్ల ముందే నిర్మాణాలు ఉన్నాయని అంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు ప్రశ్నించలేదు. కనీసం కస్టమర్‌కి సర్వీస్ ఇవ్వలేని దుస్థితి తీసుకొచ్చిన మీ తేజస్వీ టాటా మోటార్స్‌కి గుణపాఠంలా ఉండాలనే ఇలా మాట్లాడాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు.
హైదరాబాద్‌లో బుట్టా రేణుక కంపెనీల రుణం, ఇన్‌సాల్వెన్సీ
ఖానామెట్, సర్వే 11/4, 11/5లో 15 ప్లాట్లు నీలకంఠ, రేణుక పేర్లపై ఉన్నాయి. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ 2025 మే 9న వేలం ప్రయత్నం. రిజర్వ్ సుమారు రూ.325 కోట్లు. అసలు రుణం సుమారు రూ.310 నుంచి 340 కోట్లు. వడ్డీతో బకాయి సుమారు రూ.782 కోట్లు
బంజారాహిల్స్ రోడ్డు 4, 7లో సుమారు 7,321 చ.గజాలు, ఖానామెట్‌లో సుమారు 22,795 చ.గజాలు. బుట్ట ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆస్తులుగా ఎన్సీఎల్టీ రికార్డులో ఉన్నాయి
2017 ఫిబ్రవరి 15న మెరిడియన్ ఎడ్యుకేషనల్ సొసైటీకి లీజు. లిక్విడేటర్ గోనుగుంట మురళి, శివ నీలకంఠ బుట్ట, రేణుక తదితరులపై ఐపీసీ సెక్షన్ 66 కింద మోసపూరిత లావాదేవీల అప్లికేషన్ వేశారు.
లీజు అద్దె బకాయి 31 మే 2022 నాటికి సుమారు రూ.281.67 కోట్లు. కేసు ఐఏ(ఐబీసీ)/788/2022, ఎన్సీఎల్టీ హైదరాబాద్.
కేపీహెచ్‌బీ ఫేజ్ 6, సర్వే 1009, సుమారు 3,833 చ.గజాలు (మెరిడియన్ స్కూల్) కూడా అదే రికవరీలో ఉంది. రిజర్వ్ రూ.65 కోట్లు. ఇవి తనఖా ఆస్తుల వేలం, కంపెనీల లిక్విడేషన్ వివాదం. రాయదుర్గం సర్కారు భూమి ఆక్రమణపై నివేదికలు కూడా ఉన్నాయి.


