సంచలనం సృష్టించిన **స్వేచ్ఛ న్యూస్** అభినవ తుగ్లక్! కథనం
మీ నాయకుల భూములే విలువైనవా?
పేదల జాగాలు టీడీఆర్ అంటూ కొట్టేస్తారా?
జానారెడ్డి ఇంట్లో 600 గజాల మార్కింగ్‌ను 400కి తీసుకొచ్చారు
ఆ తర్వాత 30 అడుగులు అంటూ తగ్గించారు!
వాస్తు కోసమే ఫ్యూచర్ హెచ్ సిటీ పనులు ఆపేశారా?
- మీడియాతో కమిషనర్ హాస్పిటల్, నేతల ఇల్లు అని చెప్పడంతో మరింత బలపడ్డ అనుమానాలు
- భూ సేకరణలో 306 ఆస్తుల్లో అన్నీ వీఐపీల భూములే
ఒత్తిళ్లతో వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్!
- జానారెడ్డి, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, రేణుక చౌదరి, బాలకృష్ణ, కేఈ కృష్ణమూర్తి లాంటి ప్రముఖుల ఆస్తుల సంరక్షణ కోసమే ప్రాజెక్ట్ రద్దు?
- మేఘా కంపెనీకి భారీ లబ్ధి
- హెచ్ సిటీపై వందల కోట్లు ఖర్చుచేసి వెనక్కి తగ్గిన తీరుపై స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
స్వేచ్ఛ చైర్మన్
పార్క్ అంటే ప్రేమ కాదు.. పెద్దల ఇళ్లంటే ప్రేమ?
బీఆర్ఎస్ హయాంలో కేబీఆర్ పార్క్ చుట్టూ 12 అంతస్తుల భవంతులకు అనుమతులు ఇచ్చారని ఆనాడు రేవంత్ రెడ్డి గగ్గోలు పెట్టారు. ట్రాఫిక్ ఏం కావాలో ఆలోచించండి అంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక హెచ్ సీటీ పనులు అంటూ చుట్టూ 7 ప్రాంతాలను కనెక్ట్ చేసేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. వందల కోట్లు ఖర్చు పెట్టి పనులు ప్రారంభించారు. పార్క్ చుట్టూ ఉన్న 306 ఆస్తులకు మార్కింగ్ చేయించారు.
దీనిపై మాజీ మంత్రి జానారెడ్డి అగ్రహానికి గురయ్యారు. మీరు ఎలా మార్కింగ్ ఇస్తారని అధికారులపై చిందులు తొక్కారు. 10 నెలల క్రితం పేపర్లలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చెట్లు నరికేసిన తీరుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీంతో పార్క్ చుట్టూ ఉన్న భూమిలో చెట్లు కొట్టేయొద్దని ఆదేశాలు వచ్చాయి. కానీ, రాత్రికి రాత్రి వందలాది చెట్లను కొట్టేశారు. గుంతలు తీశారు. మొత్తం వన్ వే చేశారు. గ్రాఫిక్స్‌లతో ప్రపంచ స్థాయి నగరంలా ఉంటుందని చెప్పారు.
ఇంతలోనే కేసులు గుర్తుకు వచ్చాయి. నేతల ఇళ్ల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. జానారెడ్డిని కాదని పని చేయలేని రేవంత్ రెడ్డి, ఆయన ఇద్దరు కొడుకులు ఎంపీ, ఎమ్మెల్యేలుగా చుట్టూ ఉండడంతో వెనక్కి తగ్గారు. దీంతోపాటు బాలకృష్ణ ఇంటి గోడ కూడా పోతుంది. ఇలా వీవీఐపీల ఆస్తులకు నష్టపరిహారానికి రూ.200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. టీడీఆర్‌లు రెడీ చేశారు. నోటిఫికేషన్‌లో తగ్గించి 30 ఫీట్లు అంటూ మెన్షన్ చేశారు.
అయితే, జానారెడ్డి ఇంటి వాస్తు పూర్తిగా మారడంతో సీఎంపై ఒత్తిడి పెరిగింది. దీంతో కేబీఆర్ పార్క్ వెయ్యి కోట్ల ప్రాజెక్ట్‌ను రద్దు చేసి స్టీల్ బ్రిడ్జ్‌ను ముందుకు తీసుకొచ్చారు. దాంతో రేవంత్ సర్కార్ వ్యవహారంపై జనం మండిపడుతున్నారు.. ఈ ఆలోచన అప్పుడే ఎందుకు లేదని, ఆ రోడ్డుపై ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉన్నా ఎందుకు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
స్వేచ్ఛ న్యూస్ కథనంతో సోషల్ మీడియాలో ప్రచారం..
ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టే ముందే అనేక ఒత్తిళ్లు వస్తాయని ఊహించుకుని పనులు చేపట్టాలి. కానీ, 10 నెలల ముందే మార్కింగ్ ఇచ్చి, 6 నెలలుగా పనులు చేసి, తాజాగా ఐకాన్ లాంటి హైదరాబాద్‌కి మచ్చతెచ్చే పనులను వెనక్కి తీసుకోవడంపై అభినవ తుగ్లక్! అంటూ ప్రకృతిని నాశనం చేశారని స్వేచ్ఛ న్యూస్ సోమవారం కథనం రాసింది. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఉదయమే పనుల పరిశీలనకు వెళ్లారు. మీడియాతో మాట్లాడుతూ నిమిషం తర్వాత హాస్పిటల్, లీడర్స్ ఇళ్లు అంటూ చిన్నగా పలికారు. అంటే ఇదంతా పెద్దలు జానా రెడ్డి ఇంటి కోసమేననే అనుమానాలకు బలం చేకూరింది..
కుర్ర శ్రీనివాస్, ఫినిక్స్ 13 అంతస్తుల కట్టడాలపై చర్యలేవి?
గతంలో కేబీఆర్ చుట్టూ ఫినిక్స్ కంపెనీ జూబ్లిహిల్స్ సోసైటీ భూములను కబ్జా చేసుకుని నిర్మాణాలు చేపట్టింది. బీఎన్ రెడ్డి కాలనీకి ఆనుకుని ఉన్న హెరిటెడ్ భూమిని కొల్లగొట్టి 13 అంతస్థులకు కుర్ర శ్రీనివాస్ చౌదరికి మేలు చేసేలా ఆనాటి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని రేవంత్ రెడ్డినే ప్రెస్ మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఈనాడు అదే కుర్ర శ్రీనివాస్‌కి పుప్పలగూడలో ల్యాండ్ క్లియర్ చేసి, కేబీఆర్ పార్క్ వద్ద నిర్మాణం చేసిన భవంతిని మాత్రం ఎందుకు ముట్టుకోవడం లేదో అనే అంశంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అందుకే అభినవ తుగ్లక్ అని సోషల్ మీడియా కూడా అందుకుంది. పూటకో మాట రోజుకో నిర్ణయం అంటూ స్వేచ్ఛ న్యూస్ కుండ బద్దలు కోట్టేలా వార్త రాసింది. మొత్తంగా ఈ వ్యవహారంలో జానారెడ్డి, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, రేణుక చౌదరి, బాలకృష్ణ, కేఈ కృష్ణమూర్తి లాంటి ప్రముఖ ఆస్తుల సంరక్షణ కోసమే ప్రాజెక్ట్ రద్దు చేసినట్టు, ఇందులో మేఘా కంపెనీకి లబ్ధి చేకూర్చారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.


