ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈక్వాటూర్ ప్రావిన్స్‌కు చెందిన ఎన్‌గోంబే-లుకోలేలా ప్రాంత సమీపంలో కాంగో నదిపై ప్రయాణిస్తున్న రెండు పడవలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. రాజధాని కిన్షాసా వైపు నుంచి వస్తున్న ‘డైయు సె కాచే’ (Dieu se cache) అనే లోహపు నౌక, బుసింగా వైపు నుంచి వస్తున్న ‘హెచ్‌బీ సూపర్ విక్టోయిర్’ (HB Super Victoire) అనే చెక్క పడవను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఢీకొన్న తీవ్రతకు లోహపు నౌక దాటికి చెక్క పడవ క్షణాల్లో నీట మునిగిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పటికే 60కి చేరగా, అనేక మంది నదిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో పరిమితికి మించి ప్రయాణికులు, భారీగా సరుకులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న తక్షణమే స్థానిక అధికార యంత్రాంగం, నేవీ, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశాయి.
ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటం, నది లోతుగా ఉండటంతో మునిగిపోయిన వారిని వెలికితీసేందుకు గజఈతగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు మృతదేహాలను వెలికితీశారు. కాంగోలో క్రమం తప్పకుండా జరిగే పడవ ప్రమాదాలు అక్కడి రవాణా భద్రత లోపాలను ఎత్తిచూపుతున్నాయి. చీకటి వేళల్లో లైట్లు లేకుండా ప్రయాణించడం, ప్రాణరక్షణ జాకెట్లు (లైఫ్ జాకెట్లు) లేకపోవడం మరియు పరిమితికి మించి బరువులు వేయడం వల్లే తరచూ ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


