తెలంగాణ

తెలంగాణలో మహా కరువు.. రైతు కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది?

రచన: Kashi•••9 నిమిషాల పఠనం

తెలంగాణలో వానలు తగ్గాయి. పంటలపై ఒత్తిడి పెరుగుతోంది. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గాయి. భూగర్భజలాల పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే భయంకరమైన కరువు తప్పదా అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. మరి కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది..?

తెలంగాణలో 17 శాతం వర్షపాతం లోటు..

235 మండలాల్లో కరువు ఛాయలు..

తగ్గుతున్న జలాశయాల నిల్వలు..

రబీకి ముందే రైతు ముందు పెద్ద ప్రశ్నలు

ప్రభుత్వం ఏం చేస్తోంది..?

తెలంగాణలో వానలు తగ్గాయి. పంటలపై ఒత్తిడి పెరుగుతోంది. జలాశయాల్లో గతంతో పోలిస్తే నీటి నిల్వలు తగ్గాయి. భూగర్భజలాల పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే భయంకరమైన కరువు తప్పదా అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఐతే.. కరువు వచ్చాక స్పందించడమేనా? లేక కరువు రాకముందే రైతును కాపాడే చర్యలు మొదలవ్వాలా? ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందున్న కీలక ప్రశ్న.

వర్షం తగ్గితే పంట దెబ్బతింటుంది. పంట దెబ్బతింటే ఆదాయం తగ్గుతుంది. ఆదాయం తగ్గితే అప్పులు పెరుగుతాయి. అప్పులు పెరిగితే వచ్చే పంటకు పెట్టుబడి కష్టమవుతుంది. అంటే ఒక వర్షాభావం ప్రభావం ఒక సీజన్‌తో ముగిసిపోదు. రైతు కుటుంబం ఆర్థిక పరిస్థితిపై పడుతుంది. ఇప్పటికే పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రైతులు ఈ కరువు దెబ్బకు మరింత కుదేలవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది..? ఎల్ నినో గురించి ప్రెస్ మీట్లు పెట్టడమేనా లేక రైతులను ఆదుకునేందుకు ఏమైనా చర్యలు చేపడుతున్నారా..?

దెబ్బకొట్టిన నైరుతి

2026 నైరుతి రుతుపవన కాలంలో తెలంగాణలో సాధారణం కంటే సుమారు 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 18 జిల్లాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొన్నాయి. కరువు ప్రభావిత మండలాల గుర్తింపు, కేంద్ర సహాయం కోరే ప్రక్రియపై కూడా చర్చ జరిగింది. మరి దీనిపై తీసుకున్న చర్యలేంటి..?

పంటకు అవసరమైన సమయంలో వర్షం రాకపోతే, తర్వాత ఎంత వర్షం పడినా ఆ నష్టాన్ని పూర్తిగా పూడ్చడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న రైతు పొలంలో పరిస్థితి ఏంటి అన్నదే. కొన్ని ప్రాంతాల్లో పంటలు నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రైతు బోర్లు నడపాలని చూస్తున్నాడు. బోరులో నీరు ఉందా? ఉంటే ఎంతకాలం ఉంటుంది? కరెంటు ఉందా? నీరు తోడేందుకు అయ్యే ఖర్చు ఎంత? ఇవన్నీ రైతు లెక్కలు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అనధికార కరెంటు కోతలు కొనసాగుతున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి.

ఖాళీగా జలాశయాలు

ఇక జలాశయాల పరిస్థితి కూడా పెద్ద ప్రశ్నగా మారుతోంది. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన జలాశయాల నీటి నిల్వలు గత ఏడాదితో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇప్పుడున్న నీటిని ఎలా ఉపయోగించాలి? ఎక్కడ సాగుకు ఇవ్వాలి? ఎక్కడ తాగునీటికి కేటాయించాలి? రబీ సీజన్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది? ఇవన్నీ ఇప్పుడే ప్లాన్ చేయాల్సిన ప్రశ్నలు.

కరువు వచ్చిన తర్వాత ట్యాంకర్లు పెట్టడం, పంట ఎండిపోయిన తర్వాత నష్టాన్ని లెక్కించడం, రైతు నష్టపోయిన తర్వాత పరిహారం ప్రకటించడం ఇవన్నీ అవసరమే. కానీ అంతకంటే ముఖ్యమైనది ముందస్తు చర్య. అదే ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న అసలు పరీక్ష. రైతుకు ముందుగానే ఏ పంట వేయాలో సూచిస్తున్నారా? తక్కువ నీటితో పండే పంటలపై అవగాహన కల్పిస్తున్నారా? అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారా? నీటి లభ్యత ఆధారంగా మండలాల వారీగా పంట ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా? భూగర్భజలాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానమేది..?

రైతన్నకు భరోసా ఏది..?

రైతుకు కావాల్సింది కేవలం ఒక ప్రకటన కాదు. భరోసా. పంట నష్టపోతే పరిహారం వస్తుందనే నమ్మకం కావాలి. రబీకి నీరు ఉంటుందనే నమ్మకం కావాలి. తర్వాతి పంటకు పెట్టుబడి దొరుకుతుందనే నమ్మకం కావాలి. తక్కువ నీటితో పంట వేసినా మార్కెట్ ఉంటుందనే నమ్మకం కావాలి. అన్నింటికంటే తాను ఒంటరిగా లేననే నమ్మకం రైతుకు కలగాలి. ఇవన్నీ చేయాల్సింది ఎవరు..? ప్రభుత్వమే. అవును ప్రభుత్వం మాత్రమే. కరువు ప్రభావిత ప్రాంతాలను గుర్తించడం, పంట నష్టాన్ని అంచనా వేయడం, కేంద్ర సహాయం కోరడం వంటి ప్రక్రియలకు ప్రభుత్వం వెంటనే శ్రీకారం చుట్టాలి.

వ్యవసాయంలో సమయం చాలా కీలకం. పంటకు నీరు కావాల్సిన సమయంలో నీరు రాకపోతే వారం రోజుల తర్వాత వచ్చిన నీరు కూడా ఉపయోగపడకపోవచ్చు. పంటకు పెట్టుబడి కావాల్సిన సమయంలో డబ్బు అందకపోతే పంట వేసే సమయం దాటిపోవచ్చు. అందుకే కరువు నిర్వహణ అంటే కేవలం నష్టం లెక్కించడం కాదు. నష్టం రాకుండా ముందే రిస్క్ తగ్గించడం.

వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. వర్షాలు ఒకే విధంగా పడటం లేదు. ఎక్కడో భారీ వర్షం, ఎక్కడో వర్షాభావం. ఈ పరిస్థితుల్లో పాత పద్ధతులతోనే వ్యవసాయాన్ని నడపడం కష్టమవుతోంది. అందుకే తెలంగాణకు దీర్ఘకాలిక కరువు ప్రణాళిక అవసరం. ప్రతి మండలానికి నీటి లభ్యతను బట్టి పంట ప్రణాళిక, చెరువుల పునరుద్ధరణ, భూగర్భజలాల రీచార్జ్, మైక్రో ఇరిగేషన్‌కు ప్రోత్సాహం, తక్కువ నీటితో పండే పంటలకు మార్కెట్ భరోసా, పంట బీమా, నష్టపరిహారం వేగంగా అందే వ్యవస్థ... ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానంగా ఉండాలి.

లేకపోతే ప్రతి ఏడాది వర్షం కోసం ఎదురు చూడటం, వర్షం తగ్గితే ఆందోళన చెందడం, పంట నష్టపోతే పరిహారం కోరడం ఇదే చక్రం తిరుగుతూనే ఉంటుంది. మరి రైతు? అతను మాత్రం ప్రతి సీజన్‌లో కొత్త రిస్క్ తీసుకుంటూనే ఉంటాడు.

ప్రభుత్వం ఏం చేయాలి..?

ఇప్పుడు ప్రశ్న చాలా సింపుల్. కరువు వస్తేనే మేల్కొంటామా? లేక కరువు సంకేతాలు కనిపించినప్పుడే రైతును అప్రమత్తం చేస్తామా? నీటిని ముందుగానే ప్లాన్ చేస్తామా? పంటను ముందుగానే ప్లాన్ చేస్తామా? రైతుకు ముందుగానే భరోసా ఇస్తామా?

వర్షం మన చేతిలో ఉండకపోవచ్చు. కానీ వర్షం తక్కువగా ఉన్నప్పుడు రైతును ఎలా కాపాడాలి అన్నది మాత్రం మన చేతిలోనే ఉంది. కరువు ప్రకృతి విపత్తు కావచ్చు. కానీ కరువు ప్రభావం ఎంత తీవ్రంగా ఉండాలి అనేది మన ముందస్తు ప్రణాళికపై కూడా ఆధారపడి ఉంటుంది.

తెలంగాణ రైతు ఇప్పుడు ఆకాశం వైపు చూస్తున్నాడు. అదే సమయంలో ప్రభుత్వం వైపు కూడా చూస్తున్నాడు. ఆకాశం నుంచి వర్షం రావాలి. ప్రభుత్వం నుంచి భరోసా కావాలి. ఈ రెండింటిలో ఏది ఆలస్యమైనా దాని భారాన్ని మోసేది మాత్రం రైతే. అందుకే ప్రభుత్వం... మేల్కొనాల్సిన సమయం ఇదే.

#Telangana drought#Telangana farmers#drought in Telangana#Telangana rainfall#Telangana agriculture#farmer crisis#water shortage Telangana#drought threat#Telangana government#Telangana news#Telangana agriculture news#farmers issues#rural Telangana#irrigation#water crisis#Rabi season#Indian farmers#Hyderabad news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి