ఏపీ

మళ్లీ బర్డ్ ఫ్లూ పంజా.. పౌల్ట్రీ ఫారమ్‌లో 2,500 కోళ్లు మృతి!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా) కలకలం రేపింది. బుక్కరాయసముద్రం మండలం పరిధిలోని సిద్ధరాంపురం గ్రామంలోని ఒక పౌల్ట్రీ ఫారమ్‌లో విడతల వారీగా సుమారు 2,500కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటనతో పౌల్ట్రీ నిర్వాహకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

 ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా) కలకలం రేపింది. బుక్కరాయసముద్రం మండలం పరిధిలోని సిద్ధరాంపురం గ్రామంలోని ఒక పౌల్ట్రీ ఫారమ్‌లో విడతల వారీగా సుమారు 2,500కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటనతో పౌల్ట్రీ నిర్వాహకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సిద్ధరాంపురంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఈ ఫారానికి ఆదిలాబాద్ జిల్లా నుంచి కోళ్లను తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు.

 ఆదిలాబాద్ నుంచి వచ్చిన కోళ్ల గుంపు ద్వారానే ఈ వ్యాధి ఫారంలోని ఇతర కోళ్లకు వ్యాపించి ఉండవచ్చని పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. స్థానిక రైతు సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు మృతి చెందిన కోళ్ల శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. సేకరించిన శాంపిల్స్‌ను భోపాల్‌‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD) పరిశోధనశాలకు పంపించగా, అది బర్డ్ ఫ్లూ (Avian Flu) అని అధికారికంగా నిర్ధారణ అయింది.

 దీంతో జిల్లా యంత్రాంగం, పశుసంవర్ధక శాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి వ్యాప్తి చెందకుండా కఠిన నియంత్రణ చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం బాధితులుగా ఉన్న ఫారమ్‌లోని బతికి ఉన్న కోళ్లను, సంబంధిత ప్రాంగణాన్ని క్వారంటైన్ చేశారు. కలుషితమై ఉండవచ్చని భావిస్తున్న గుడ్లు, కోళ్ల ఎరువు, ఇతర పదార్థాలను శాస్త్రీయంగా వేరు చేసి చనిపోయిన పక్షులను సురక్షిత ప్రాంతాల్లో పూడ్చిపెడుతున్నారు. ప్రభావిత ఫారమ్‌కు 10 కిలోమీటర్ల పరిధిని నిఘా ప్రాంతంగా ప్రకటించి, మూడు నెలల పాటు సిద్ధరాంపురం గ్రామంలోకి కోళ్ల రాకపోకలను పూర్తిగా నిషేధించారు.

 ఇదిలా ఉండగా పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని జిల్లా అధికారులు స్పష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా పరిసర ప్రాంతాల్లోని ఇతర పౌల్ట్రీ ఫారమ్‌లలో కూడా పశుసంవర్ధక శాఖ బృందాలు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ శాంపిళ్లను సేకరిస్తున్నాయి. చికెన్, గుడ్లను బాగా ఉడికించి మాత్రమే తీసుకోవాలని, పౌల్ట్రీ నిర్వాహకులు బయో-సెక్యూరిటీ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏవైనా ఫారమ్‌లలో కోళ్లు వింతగా ప్రవర్తించినా లేదా అస్వస్థతకు గురై మరణించినా వెంటనే పశువైద్యాధికారులకు సమాచారం అందించాలని అధికారులు ఆదేశించారు.

#BirdFluAnantapur#AvianInfluenza#APNews#PoultryFarmLoss#Bukkarayasamudram#AndhraPradeshNews#AnimalHusbandry
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి