క్రైమ్

Road Accident: నల్లమలలో ఘోర రోడ్డు ప్రమాదం.. షాకిస్తున్న మరణాల నివేదికలు!..

రచన: Venu•••5 నిమిషాల పఠనం

మరణాలలో అత్యధికంగా 18 నుండి 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న యువకులే రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని నివేదికలు తెలుపుచున్నాయి.

జీవితం అత్యంత అమూల్యమైనది. అందుకే రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో చాలా అప్రమత్తత అవసరం.. ఎందుకంటే ఒక వ్యక్తి వెనుక అతని కుటుంబం ఉంటుంది. ఆ వ్యక్తి అనుకోని ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతే అతనికి కుటుంబానికి కలిగే లోటు పూడ్చలేనిది. ప్రస్తుతం నిత్యం ఎక్కడో ఒకచోట అజాగ్రత్త వల్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేయడం కనిపిస్తుంది.

ఇక తాజాగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైర్లూటి చెంచుగూడేనికి సమీపంలో ఆర్టీసీ బస్సు, బొలెరో పికప్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం ప్రకారం.. కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కర్నూలు నుండి ఆత్మకూరు మీదుగా కాకినాడకు వెళ్తున్న సమయంలో, గుంటూరు నుండి కర్నూలు వైపు వస్తున్న బొలెరో పికప్ వాహనం (TS 02 UD 1153) బైర్లూటి చెంచుగూడేనికి రెండు కిలోమీటర్ల దూరంలో ఎదురుగా బస్సును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించినట్టు సమాచారం. మృతి చెందిన వారిలో తెలంగాణలోని గద్వాల జిల్లాకు చెందిన నితిన్, కర్నూలు జిల్లా ఆర్.కే. దుద్యాల గ్రామానికి చెందిన ఈడిగ దేవేంద్రగౌడ్ ఉన్నట్టు తెలుస్తుంది. తీవ్రంగా గాయపడిన మరొకరిని 108 అంబులెన్స్ ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

మరోవైపు ప్రమాదం జరిగిన ప్రదేశం దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతం కావడం, అందులో ప్రమాదం జరిగిన సమయం అర్ధరాత్రి కావడం వల్ల అక్కడ పూర్తిగా చీకటిగా ఉంది. అందులో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో సమాచారం అందించేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. ఇక ప్రమాద ఘటన తాలూకు సమాచారం అందుకున్న ఆత్మకూరు అర్బన్ సీఐ ఓ. మహేశ్వర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన బొలెరో వాహనాన్ని, అందులో చిక్కుకున్న డ్రైవర్ మృతదేహన్ని జేసీబీ సాయంతో దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి పోలీసు సిబ్బంది బయటికి తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇలా తరచుగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశంగా పేర్కొంటున్నారు..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారుగా 11.6 లక్షల నుండి 11.9 లక్షల మంది రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలుస్తుంది. అలాగే భారత కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం, దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.77 లక్షల మంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారని పేర్కొంది.

ఈ లెక్కల ప్రకారం చూస్తే.. భారతదేశంలో రోజుకు సగటున దాదాపు 485 మంది ప్రమాదాల బారిన పడి మృతి చెందుతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇక మరణాలలో అత్యధికంగా 18 నుండి 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న యువకులే రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని ఈ నివేదికలు తెలుపుచున్నాయి. అందులో 45% కంటే ఎక్కువ మంది ద్విచక్ర వాహనాలు నడిపేవారే కావడం గమనార్హం...

#Nallamala Road Accident#Bairluti Bus Crash#Kurnool Accident News#Road Safety Awareness#RTC Bus Accident#Traffic Rules India#Telangana News Today#Andhra Pradesh News Today#swecha news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి