బీజేపీ 1984 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. కానీ నాలుగు దశాబ్దాల్లో దేశ రాజకీయాల్లో కీలక పార్టీగా ఎదిగింది. ఇక ఉత్తర భారతంలో పరిమితమైన పార్టీగా ఉన్న బీజేపీ.. క్రమంగా పశ్చిమం, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించింది. దక్షిణాదిలో మాత్రం పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని సాధించలేకపోయినా.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో తన రాజకీయ ఉనికిని మాత్రం పెంచుకుంది.
బీజేపీ ఎదుగుదల వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలేంటి?
ఇక 1980 ఏప్రిల్ 6న బీజేపీ ప్రస్థానం ప్రారంభమైంది. పార్టీ తన రాజకీయ ప్రయాణాన్ని అటల్ బిహారీ వాజ్‌పేయీ, లాల్‌కృష్ణ అద్వానీ వంటి నేతల నాయకత్వంలో మొదలుపెట్టింది. తొలి దశలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. 1980ల చివరినాటికి పరిస్థితిలో మార్పు చోటు చేసుకుంది. ఆ సమయంలో చేసిన రామజన్మభూమి ఉద్యమం కీలక మలుపుగా మారింది. అప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ.. ఎల్‌కే అద్వానీ చేపట్టిన రథయాత్రతో అయోధ్య అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
హిందూత్వ భావజాలాన్ని రగిలించడంతో బీజేపీకి కొత్త ఓటు బ్యాంకు ఏర్పడింది. ఫలితంగా 1984లో రెండు స్థానాలకు పరిమితమైన పార్టీ.. 1989 ఎన్నికల నాటికి 85 స్థానాలకు చేరుకుంది.. అనంతరం 1996లో తొలిసారి కేంద్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ఆ తర్వాత ఎన్డీయే కూటమి ద్వారా తన అధికార పరిధిని విస్తరించింది. 1998, 1999లో కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేసి.. 2004 వరకు కేంద్ర రాజకీయాల్లో బలమైన ప్రత్యామ్నాయ పార్టీగా నిలిచింది.
ఈ దశలో అటల్ బిహారీ వాజ్‌పేయీ నాయకత్వం బీజేపీకి కీలకంగా మారింది. కూటమి రాజకీయాలను సమర్థంగా నిర్వహించడం, ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవడం ద్వారా పార్టీ హిందీ రాష్ట్రాల పరిధిని దాటి జాతీయ స్థాయిలో అధికారాన్ని నిలబెట్టుకుంది.
బీజేపీ రాజకీయ చరిత్రనే మార్చేసిన 2014..
నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 స్థానాలు గెలుచుకుని మెజారిటీ సాధించింది. 2019లో ఆ సంఖ్య 303కు పెరిగింది. 2024లో బీజేపీకి 240 స్థానాలు వచ్చినప్పటికీ.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మద్దతుతో మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు బీజేపీకి సొంతంగా బలం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అక్కడి రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంది.
ఇక 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో వరుస ఓటములు.. కొన్ని రాష్ట్రాల్లో ఎదురైన పరాజయాలు.. 2024లో సొంత మెజారిటీ కోల్పోవడం.. ఇవన్నీ పార్టీ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయి.. అలా ఎన్నో వ్యూహాలు ఎదురు దెబ్బలతో తిరులేని పార్టీగా ఎదిగిన బీజేపీకి ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీవల్ల సమస్యలు ఎదురవుతున్నాయనే ఆరోపణలు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి..
ఇక మొదట కాక్రోచ్ జనతా పార్టీ మొదలు పెట్టిన ఉద్యమం.. నిరుద్యోగం, విద్యా వ్యవస్థపై యువత అసంతృప్తికి వేదికగా కనిపించింది. కానీ క్రమక్రమంగా రోడ్డెక్కి, ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేసే స్థాయికి వెళ్లింది. చివరికి విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు వెళ్లిన ఈ ఉద్యమం.. ఇప్పుడు ఓటర్ల జాబితా, ఎన్నికల వ్యవస్థపై ప్రశ్నలు సంధిస్తోంది.
బీజేపీకి అసలు సమస్య ఇక్కడే
కేవలం ఒక చిన్న వ్యంగ్య రాజకీయ గ్రూప్‌గా కాక్రోచ్ జనతా పార్టీని కొట్టిపారేయడం సులభమే. కానీ యువతలో ఉన్న అసంతృప్తిని అది ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురాగలగడం.. బీజేపీకి తలనొప్పిగా మారిందని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో యువత, నిరుద్యోగం, ఆర్థిక అవకాశాల అంశాలు బీజేపీపై ప్రభావం చూపాయని రాజకీయ విశ్లేషణలు అప్పట్లోనే చెప్పాయి. ఇప్పుడు అదే అసంతృప్తి మరో రూపంలో బయటకు వస్తోందన్న చర్చ మొదలైంది.
ఇప్పటికే ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి కాక్రోచ్ జనతా పార్టీ ఒక డిజిటల్ రాజకీయ వేదికగా మారితే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుందని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి ఇక గతంలోనూ ఇలాంటి రాజకీయ వ్యతిరేకతలు బీజేపీకి పెద్ద తలనొప్పినే తెచ్చాయి. ముఖ్యంగా యువతను ఆకర్షించే అంశాల్లో ప్రత్యర్థి పార్టీలు సోషల్ మీడియాను బలంగా ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి ప్రతిపక్ష పార్టీ మీమ్స్, వ్యంగ్యం, వైరల్ కంటెంట్, నిరుద్యోగ యువత అసంతృప్తి.. ఇవన్నీ కలిపి కొత్త తరహా రాజకీయ కమ్యూనికేషన్‌ను నిర్మిస్తోంది.
ఢిల్లీ పెద్దలకు అసలు చిక్కు ఇదే.
మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ ఎంత తీవ్రంగా స్పందిస్తే.. అంతగా ఆ ఉద్యమానికి ప్రచారం లభించే అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తుంది.. అలాగని పట్టించుకోకుండా వదిలేస్తే.. యువతకు బోద్దింకలు మరింత దగ్గరయ్యే ప్రమాదం ఉంది. అంటే ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైందని అంటున్నారు.
ఇప్పటికే ఎన్నికల జాబితా మార్పులపై కాక్రోచ్ జనతా పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి నిరసనలు చేపట్టడం పొలిటికల్ హిట్ పెంచింది. ఇక బీజేపీకి అసలు సమస్య కాక్రోచ్ జనతా పార్టీ పోటీ చేయడం కాదు. ఆ పార్టీ లేవనెత్తుతున్న అంశాలు యువతలో బీజేపీకి వ్యతిరేకంగా మారుతున్నాయనే ఆందోళన పార్టీలో కనిపిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగం, ఉద్యోగ అవకాశాలు, విద్య, ఎన్నికల వ్యవస్థ వంటి అంశాలు యువ ఓటర్లపై ప్రభావం చూపితే.. అది నేరుగా బీజేపీ ఓటు బ్యాంకు పై ప్రభావం చూపుతుందని విశ్లేషిస్తున్నారు.
బొద్దింకలకు అంత సీన్ ఉందా?
ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం ఎన్నికల్లో నేరుగా సీట్లు గెలుచుకునే స్థాయిలో ఉందా అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేసే ఒక వాతావరణాన్ని మాత్రం సృష్టిస్తోంది. ముఖ్యంగా మొదటిసారి ఓటర్లు, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత, ప్రభుత్వ వ్యవస్థపై అసంతృప్తిగా ఉన్న వర్గాలు ఒకే డిజిటల్ వేదికపైకి వస్తే.. అది ప్రధాన పార్టీలకు హెచ్చరికగా మారుతుంది.
అందుకే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఎంత పెద్దది అన్నది కాదు. అది లేవనెత్తుతున్న ప్రశ్నలు ఎంతమంది యువతను ప్రభావితం చేస్తున్నాయన్నదే ఢిల్లీ పెద్దల ముందున్న సమాధానం లేని ప్రశ్నగా మారిందని అంటున్నారు.. ఒకప్పుడు వ్యంగ్యంగా పెట్టుకున్న కాక్రోచ్ పేరే ఇప్పుడు రాజకీయ గుర్తింపుగా మారింది. దాన్ని అణచాలని చూస్తే మరింత వైరల్ అయ్యే అవకాశం.. పట్టించుకోకపోతే మరింత విస్తరించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
అందుకే.. లక్ష్మణరేఖ దాటుతున్న ఈ బొద్దింకలను ఢిల్లీ పెద్దలు ఎలా ఎదుర్కొంటారు? ప్రత్యక్ష రాజకీయ పోరాటంతోనా.. లేక యువతలో పెరుగుతున్న అసంతృప్తికి సమాధానం చెప్పడం ద్వారానా? అనేది ఇప్పుడు బీజేపీకి సవాల్ గా మారిన అగ్ని పరీక్షగా చర్చించుకుంటున్నారు..


