హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ నెల 14న జరగనున్న భారత్ - వెస్టిండీస్ నాలుగో టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ అంతర్జాతీయ మ్యాచ్‌ను వీక్షించేందుకు క్రికెట్ ప్రేమికుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొనగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. క్రీడల పట్ల విద్యార్థుల్లో స్పూర్తిని నింపేందుకు, దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న సైనికులను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఉచిత టికెట్లను కేటాయించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మరియు ఆర్మీ సిబ్బంది కోసం మొత్తం 2,750 ఉచిత టికెట్లను అందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2,500 టికెట్లు, ఆర్మీ సిబ్బందికి 250 టికెట్లను కేటాయించారు. ఈ మ్యాచ్ కోసం మొత్తం 34 వేల టికెట్లను ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంచగా, ప్రారంభ ధర రూ.750 నుంచి విక్రయాలు జరిగాయి.
మరోవైపు ఉప్పల్ స్టేడియంలో గతంలో తలెత్తిన పార్కింగ్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హెచ్‌సీఏ ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అభిమానుల సౌకర్యార్థం పార్కింగ్ సామర్థ్యాన్ని భారీగా పెంచడంతో ఏకకాలంలో 4,500 కార్లు పార్క్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే దాదాపు 15 ఏళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో సరికొత్త పిచ్‌ను ఏర్పాటు చేయడం ఈ మ్యాచ్‌కు మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.












