Kiran: కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత ఎంఏ గఫూర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. గఫూర్, ఐద్వా నాయకురాలు నిర్మల కుమారుడు కిరణ్ అమెరికాలో మృతి చెందారు. కిరణ్ వయసు 41ఏళ్లు. కిరణ్ కాలిఫోర్నియాలో జాబ్ చేస్తున్నారు. అపార్ట్ మెంట్ లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈ నెల 1వ తేదీన నిద్రలోనే కిరణ్ కు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆయన చనిపోయారు. ఈ విషయం కుటుంబసభ్యులకు ఆలస్యంగా తెలిసింది.
సీనియర్ డేటా సైంటిస్ట్
మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేసిన కిరణ్.. న్యూయార్క్ యూనివర్సిటీలో డేటా సైన్స్ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించారు. కాలిఫోర్నియాలోని పే పాల్ సంస్థలో సీనియర్ డేటా సైంటిస్ట్ గా పని చేస్తున్నారు. శాన్ జోస్ లో అపార్ట్ మెంట్ లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. కాగా, కొన్ని రోజులుగా కిరణ్ డ్యూటీకి రాకపోవడంతో కంపెనీ ప్రతినిధులు కిరణ్ ఫ్రెండ్స్ కి సమాచారం ఇచ్చారు.
వారు కిరణ్ రూమ్ కి వెళ్లి ఎంక్వైరీ చేయగా కిరణ్ మృతి విషయం బయటపడింది. కిరణ్ ఫ్రెండ్స్ ద్వారా తమకు సమాచారం వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. కిరణ్ మృతదేహాన్ని కర్నూలుకు తరలించేందుకు తానా ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. కిరణ్ మృతదేహం కర్నూలుకు తీసుకురావడానికి 4 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది.
కిరణ్ మృతితో గఫూర్ ఇంట్లో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న నాయకులు, ప్రజాప్రతినిధులు గఫూర్ దంపతులను పరామర్శించారు.
నిద్రలోనే స్ట్రోక్ వచ్చి కన్నుమూత
''కిరణ్ అమెరికాలో మొన్నటివరకు సియాటల్ లో ఉన్నాడు. 2 నెలల క్రితమే కాలిఫోర్నియా మారాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. చాలా మంచి పొజిషన్ లోనే ఉన్నాడు. కిరణ్ బాగా ఆనందంగా ఉన్నాడని అనుకున్నాం. అప్పుడప్పుడు కిరణ్ తో మాట్లాడేవాళ్లం. 1వ తేదీన రాత్రి తన రూమ్ లో ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో స్ట్రోక్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికి చనిపోయాడు.
ఆ విషయం మాకు ఆలస్యంగా తెలిసింది. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. ఎన్ఆర్ఐలకు ఫోన్ చేసి సాయం అడిగాము. మా అబ్బాయి గురించి వెతకమని చెప్పాము. వాళ్లు కిరణ్ గురించి వాకబు చేశారు. అప్పుడే ఈ సమాచారం మాకు తెలిసింది'' అని కిరణ్ తండ్రి గఫూర్ తెలిపారు.












