RTC Elections: తెలంగాణలో 10ఏళ్ల తర్వాత ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆర్టీసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ మద్దతు తెలిపిన తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూ) ఓటమి పాలైంది. దీనిపై కాంగ్రెస్ పోస్టుమార్టం చేపట్టింది.
మంత్రులు, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్లే ఓటమి!
ఆర్టీసీ ఎన్నికల్లో వైఫల్యంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. ఎన్నికల సరళిపై నివేదిక తెప్పించుకున్నారు. సొంత పార్టీ నేతలే ప్రత్యర్థి యూనియన్ కు మద్దతిచ్చారన్న విషయం నివేదికలో వెల్లడైంది. 4 జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్లే ఓడిపోయామని మహేశ్ కుమార్ గౌడ్ కు నివేదిక అందినట్లు సమాచారం. ఖమ్మం, నల్గొండ మినహా మిగతా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లు ఆర్టీసీ ఎన్నికలను పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో త్వరలో ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులతో మహేశ్ గౌడ్ భేటీ కానున్నారని తెలుస్తోంది.
ఫలించని వ్యూహాలు
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలను కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. కానీ, అవేమీ ఫలించలేదు. దశాబ్ద కాలం తర్వాత నిర్వహించిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఆర్టీసీ కార్మిక సంఘం ఈయూ (ఎంప్లాయ్స్ యూనియన్) కూటమి ఘన విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 26 డిపోల్లో కేవలం 3 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది.
సీరియస్‌గా తీసుకోని ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూ) ఓటమిపై పోస్టుమార్టం చేసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఆర్టీసీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోలేదని నివేదిక అందింది. కొన్నిచోట్ల ఎంప్లాయ్స్ యూనియన్ కు సంబంధించిన యూనియన్లకు ఎమ్మెల్యేలే గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంప్లాయ్స్ యూనియన్ కే సపోర్ట్ చేసినట్లుగా నివేదికలో వెల్లడైంది.
కార్మికులు ఎందుకు ఆదరించలేదు?
తెలంగాణకు గుండె లాంటి హైదరాబాద్ లో 26 డిపోల్లో కేవలం 3 మాత్రమే కాంగ్రెస్ మద్దుతు తెలిపిన యూనియన్ గెలిచింది. మిగతావన్నీ ఎంప్లాయ్స్ యూనియన్ ఖాతాల్లో చేరాయి. దీనిపై మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా.. కార్మికులు తమను ఆదరించకపోవడాన్ని అధికార పార్టీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు.












