National

BRS: అటు కాంగ్రెస్‌తో కలవలేక.. ఇటు బీజేపీ ముద్ర పడనీయక.. గులాబీ పార్టీలో డైలమా!

రచన: Mahesh•••5 నిమిషాల పఠనం

BRS: దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి ఎన్నికల సంఘం తీరుపై, 'స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్' (సర్) వ్యవహారంపై కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తుంటే.. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ మాత్రం ఎటూ తేల్చుకోలేక తీవ్ర అయోమయంలో పడింది. అటు కాంగ్రెస్ నడుపుతున్న ఆందోళనల్లో భాగస్వామ్యం కాలేక, ఇటు బీజేపీకి అనుకూలమనే ముద్ర పడకుండా కాపాడుకోలేక గులాబీ బాస్‌లు తీవ్ర సందిగ్ధాన్ని ఎదుర్కొంటున్నారు.

BRS: దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి ఎన్నికల సంఘం తీరుపై, 'స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్' (సర్) వ్యవహారంపై కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తుంటే.. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ మాత్రం ఎటూ తేల్చుకోలేక తీవ్ర అయోమయంలో పడింది. అటు కాంగ్రెస్ నడుపుతున్న ఆందోళనల్లో భాగస్వామ్యం కాలేక, ఇటు బీజేపీకి అనుకూలమనే ముద్ర పడకుండా కాపాడుకోలేక గులాబీ బాస్‌లు తీవ్ర సందిగ్ధాన్ని ఎదుర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి దుమ్మురేపుతున్న వేళ, బీఆర్‌ఎస్ వైఖరి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కాంగ్రెస్‌తో కలవడమా? అస్సలు కుదరదు!

ఓటు చోరీ, ఎస్ఐఆర్ రద్దు డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. విపక్షాల మద్దతుతో లోక్‌భవన్‌ల ముట్టడి వరకు వ్యవహారం వెళ్లింది. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో రోజూ కయ్యానికి దిగుతున్న బీఆర్‌ఎస్.. అదే పార్టీ నాయకత్వంలో జరిగే నిరసనల్లో ఎలా పాల్గొంటుందనేది పెద్ద చిక్కు ప్రశ్న. రాష్ట్రంలో ఎన్నికల హామీలు నెరవేర్చలేదంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేస్తున్న వేళ, ఢిల్లీ వేదికగా వారితో వేదిక పంచుకుంటే తమ రాజకీయ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని కేటీఆర్, హరీష్ రావు వంటి గులాబీ అగ్రనేతలు భావిస్తున్నారట. అందుకే ఈ నిరసనలను కేవలం ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా పోస్టులకే పరిమితం చేశారని చెబుతున్నారు.

మౌనంగా ఉంటే కాషాయ ముద్ర భయం!

అలాగని కామ్‌గా ఉండిపోతే ఇంకో పెను ప్రమాదం పొంచి ఉంది. ఎస్ఐఆర్ వ్యవహారంపై పెద్దగా స్పందించకపోతే బీజేపీతో బీఆర్‌ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్న ప్రచారం జోరందుకుంటుందన్న ఆందోళన గులాబీ నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఈ ఆరోపణలను అస్త్రాలుగా వాడుకుంటున్నాయి. అందుకే తాము అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపును వ్యతిరేకిస్తూ అందరికంటే ముందే ఈసీని కలిశామని గులాబీ దళం గుర్తు చేస్తోంది. సీఈసీ రాజీనామా డిమాండ్‌ను తెరపైకి తెస్తూనే, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లకుండా నానా తంటాలు పడుతోంది.

హైదరాబాద్‌కే పరిమితమైతే ప్రభావం ఉంటుందా?

కాంగ్రెస్ ఢిల్లీలో చక్రం తిప్పుతుంటే.. తాము హైదరాబాద్‌లోనే నిరసనలకు దిగుతామని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం రేపుతున్న ఇంతటి పెద్ద అంశంలో, కేంద్ర స్థాయి పోరాటం లేకుండా రాష్ట్రంలో చేసే లోకల్ నిరసనలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్న ప్రశ్నలు స్వయంగా పార్టీ అంతర్గత వర్గాల నుంచే వస్తున్నాయి. జాతీయ వేదికలపై గళమెత్తకుండా హైదరాబాద్‌కే పరిమితమైతే ప్రజలు తమ చిత్తశుద్ధిని ఎలా నమ్ముతారన్నది కొందరు నేతల వాదన. ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిన ఈ ఎస్ఐఆర్ సంక్షోభం నుంచి బీఆర్‌ఎస్ నాయకత్వం ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాలి.

#BRS#Bharat Rashtra Samithi#BRS News#Telangana Politics#BRS Political Dilemma#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి