TBJP: తెలంగాణ బీజేపీ పార్టీలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది స్టార్టింగ్‌లో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాషాయ శిబిరంలో ఒకవైపు విపరీతమైన పోటీ (అతివృష్టి), మరోవైపు కనీసం బరిలో నిలబడేందుకు నాయకులే ముందుకు రాని పరిస్థితి (అనావృష్టి) పార్టీ నాయకత్వాన్ని తలపట్టుకునేలా చేస్తోంది. రెండు నియోజకవర్గాల్లో పార్టీ ఎదుర్కొంటున్న ఈ పరస్పర విరుద్ధ పరిస్థితులు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
హైదరాబాద్ స్థానానికి పోటెత్తిన దరఖాస్తులు
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం బీజేపీలో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో టికెట్ కోసం ఏకంగా 28 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. కొందరు నేతలు తమకే టికెట్ ఖాయమన్న ధీమాతో గ్రౌండ్ లెవల్‌లో ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. సంస్థాగత బలం, అర్బన్ ఓటర్ల మద్దతు పుష్కలంగా ఉండటంతో ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువని భావించి నేతలంతా టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండలో 'అభ్యర్థి కావలెను' బోర్డు
హైదరాబాద్‌లో టికెట్ల కోసం నేతలు ఎగబడుతుంటే.. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానంలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ పోటీ చేయడానికి బలమైన నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ మూడు ఉమ్మడి జిల్లాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం బలహీనంగా ఉండటం, గత ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు సైతం తమ చదువు, పెంపకం హైదరాబాద్‌లోనే జరిగిందని చెబుతూ హైదరాబాద్ సీటు వైపే మొగ్గు చూపుతుండటం గమనార్హం.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేయగా, బీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలంటే ఆర్థిక, అంగబలం కలిగిన బలమైన బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నప్పటికీ, అందుకు తగిన స్థాయిలో లీడర్లు దొరక్కపోవడం పార్టీని ఇరకాటంలో పడేసింది. అభ్యర్థిపై స్పష్టత లేకపోవడంతో క్యాడర్‌లోనూ ఓటర్ నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టి పోటీని రసవత్తరంగా మార్చడం తెలంగాణ బీజేపీ నాయకత్వంతో పాటు కొత్త రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌కు కూడా పెను సవాలుగా మారిందనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.












