తారాస్థాయికి చేరిన రేవంత్ - రాజగోపాల్ రెడ్డి వార్
హైకోర్టును ఆశ్రయించిన రాజగోపాల్ రెడ్డికి చెందిన సంస్థ
రూ.600కోట్ల స్కాం ఆరోపణలు, టెండర్లలో భారీ కుమ్మక్కు
కేవలం 6 రోజుల్లోనే రికార్డు స్థాయిలో టెండర్ల ప్రక్రియ పూర్తి
ఆర్థికంగా బలపడకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు
హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
మంత్రివర్గంలో పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కినట్లు తెలుస్తోంది. రేడియల్ రోడ్-2 టెండర్ల ప్రక్రియ ఈ ఇద్దరి నేతల మధ్య అగ్గిరాజేసింది. ముఖ్యమంత్రి అండదండలతోనే ఈ టెండర్లలో దాదాపు రూ.600కోట్ల మేర భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ రాజగోపాల్ రెడ్డికి చెందిన 'సుశీ ఇన్‌ఫ్రా' సంస్థ తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయించింది. తమను అన్యాయంగా అనర్హులుగా ప్రకటించి, రూ.600కోట్లు ఎక్కువ కోట్ చేసిన సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించారని సుశీ ఇన్‌ఫ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
చిన్న సాకుతో సుశీ ఇన్‌ఫ్రాపై అనర్హత వేటు
హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) పరిధిలో బుద్వేల్ ఓఆర్ఆర్(ORR) నుంచి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ వద్ద ఉన్న NH-167ఎన్ వరకు 81.15 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే (రేడియల్ రోడ్-2) నిర్మాణానికి అధికారులు టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి బిడ్లను ఆహ్వానించారు. ఇందులో పాల్గొన్న సుశీ ఇన్‌ఫ్రా అత్యంత తక్కువ ధర (L-1) కోట్ చేసినప్పటికీ, అధికారులపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు రావడం వల్ల సాంకేతిక కారణాల సాకుతో బిడ్‌ను తిరస్కరించారని సదరు సంస్థ ఆరోపిస్తోంది. సూపర్ ఇంటెండింగ్ ఇంజనీర్ (SE) బదులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) సంతకం ఉందనే నిబంధనను చిన్న సాకుగా చూపి సుశీ ఇన్‌ఫ్రాపై అనర్హత వేటు వేసినట్లు తెలుస్తోంది.
వివరాల గోప్యంపై అనుమానాలు
ఈ మొత్తం వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు.. ప్యాకేజీ-1 ను అంచనా వ్యయం కంటే 3.95 శాతం అధికంగా కోట్ చేసిన NCC లిమిటెడ్‌కు రూ.1,286.03 కోట్లకు కట్టబెట్టారు. అలాగే ప్యాకేజీ-2ని బీవీఎస్ఆర్ (BVSR) సంస్థకు, ప్యాకేజీ-3ని జీకేసీ (GKC) సంస్థకు కేటాయించారు. అయితే ఈ రెండు సంస్థలు ప్రభుత్వ అంచనా వ్యయం కంటే ఎంత ఎక్కువ కోట్ చేశాయన్న వివరాలను సైతం అధికారులు గోప్యంగా ఉంచడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అర్హత ఉన్న తమ సంస్థ బిడ్లను ఏకపక్షంగా పక్కనపెట్టి, ఎలాంటి స్పష్టమైన కారణాలు తెలపకుండానే అధిక ధరకు కోట్ చేసిన సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించారని సుశీ ఇన్‌ఫ్రా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
సీఎం సన్నిహితుల ఒత్తిడి?
సాధారణంగా ప్రభుత్వ టెండర్ల సాంకేతిక మదింపు, బిడ్ల పరిశీలన సుదీర్ఘంగా సాగుతుంది. కానీ, ఈ ప్రాజెక్టు విషయంలో గత నెల 30న టెండర్ల దాఖలుకు చివరి తేదీ ముగియగా, కేవలం ఆరు పని దినాల్లోనే సాంకేతిక మదింపు పూర్తి చేయడం సంచలనంగా మారింది. అనర్హులపై వేటు వేయడం, కమిటీ సిఫార్సులను రికార్డు చేయడం, ప్రభుత్వ ఆమోదాలు పొందడం, ఫైనాన్షియల్ బిడ్లు తెరవడం, చివరకు కాంట్రాక్టులు అప్పగించడం వరకు అంతా చకచకా ముగించేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వారి ఒత్తిళ్లతోనే అధికారులు ఇంత వేగంగా, నిబంధనలను పక్కనపెట్టి కాంట్రాక్టులను కట్టబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన కోమటిరెడ్డి
రాజకీయంగా, ఆర్థికంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలపడితే భవిష్యత్తులో తనకు ముప్పుగా మారతారనే ముందస్తు ఆలోచనతోనే రేవంత్ రెడ్డి ఈ కాంట్రాక్ట్ ఆయనకు దక్కకుండా వెనుకుండి చక్రం తిప్పారని కాంగ్రెస్, రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సీఎం రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ పిటిషన్‌ను ఎదుర్కొని, ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ఖరీదైన సీనియర్ న్యాయవాదిని కూడా రంగంలోకి దించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.












