ఒక్కోసారి చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో తెలియచేసే సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా అది వాళ్ళ ప్రాణాలను రిస్క్ లో పెడుతుందని గతంలో ఎన్నో ఘటనలు నిరూపించాయి.. అందుకే పిల్లలను బయటికి తీసుకెళ్తున్నప్పుడు ఎంతో జాగ్రత్త అవసరమని పలు సంఘటనలు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నా కొందరిలో మార్పు రాకపోవడం విచారకరం.
హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బంగారం మెరుగుపెట్టే కెమికల్ నోట్లో పెట్టుకుని రెండేళ్ల బాలిక మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. కుతుబుల్లాపూర్ నియోజకవర్గం చింతల్‌లోని విష్ణు జువెలరీస్‌కు రెండు రోజుల క్రితం గోపికృష్ణ, జానకి దంపతులు బంగారం కొనుగోలు చేయడానికి వెళ్లారు. వారితో పాటు తమ రెండేళ్ల కూతురు మిషాను కూడా వెంట తీసుకెళ్లారు.
అయితే పాముకు తాడుకు తేడా తెలియని పసితనం వల్ల తన ప్రాణాలు పోతున్నాయని గమనించని ఆ చిన్నారి.. తల్లిదండ్రులు షాప్‌లో బంగారు ఆభరణాలను పరిశీలిస్తుండగా.. అక్కడే ఉన్న బంగారం చెక్ చేసే కెమికల్‌ను నోట్లో పెట్టుకుంది. ఆ కెమికల్ కడుపులోకి వెళ్లడంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే గమనించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ పాప మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని శోకంగా మారింది.
మరోవైపు తమ పాప మృతికి విష్ణు జువెలరీస్ నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు విష్ణు జువెలర్స్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. ఇక ఎవరి నిర్లక్ష్యం అయితే నేమి ఒక పసిపాప ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు ఏం చేసిన ఆ చిన్నారి తిరిగి రాదు. అయిన ఇందులో తల్లిదండ్రుల నిర్లక్ష్యమే ఎక్కువ కనిపిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.. ఈ క్రమంలో పిల్లల పట్ల తల్లిదండ్రుల నిఘా మరోసారి ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..












