స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Telangana: బీఆర్ఎస్ ఆస్తుల లెక్కలు చెప్పావ్.. బీజేపీ నేతల ఆస్తుల సంగతేంటి రేవంత్?!

రచన: Venu•••7 నిమిషాల పఠనం

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఆస్తుల వివాదం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. అంతే కాదు.. ఈ వివాదం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కొత్త అస్త్రంగా మారింది.

పిట్టల దొరకు ఎక్కువ.. ఫకీర్ కు తక్కువ

వాడి ఆస్తులు, వీడి ఆస్తులు ఇన్ని అంటూ లెక్కలు

బీఆర్ఎస్ ఆస్తులపై ఉన్న ఉత్సాహం బీజేపీ నేతలపై ఎందుకు లేదు?

కార్పొరేటర్ పోటీకి డబ్బులు లేని బండి సంజయ్ ఎలా సంపాదించారు?

పూటకు లేని రిపోర్టర్ రఘునందన్ ఆస్తులు ఎన్నో చెప్పలేదు!

అరవింద్ మాయల బిజినెస్ గురించి ఊసే ఎత్తలేదు?

సోయిలేని పాలనతో తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నావ్ రేవంత్?

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

స్వేచ్చ న్యూస్ చైర్మన్

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఆస్తుల వివాదం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. అంతే కాదు.. ఈ వివాదం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కొత్త అస్త్రంగా మారింది. ఇక గతంలో అధికారంలో ఉన్నవాళ్లు ఎంత సంపాదించారు.. ఎవరి ఆస్తులు ఎంత పెరిగాయి.. ప్రజాప్రతినిధుల ఆర్థిక ఎదుగుదల వెనుక ఉన్న కథేంటి.. అనే అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే ఈ లెక్కల్లో బీఆర్ఎస్ నేతల ఆస్తుల ప్రస్తావనకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్న రేవంత్ రెడ్డి బీజేపీ నేతల ఆస్తుల పై మాట్లాడక పోవడం విమర్శలకు దారి తీస్తుంది. సీఎం వ్యవహార శైలి రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టే ప్రయత్నం కనిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల ఆస్తులపై చర్చ జరగడం తప్పు కాదు. ప్రజా జీవితంలో ఉన్నవారి ఆర్థిక వ్యవహారాలపై పారదర్శకత ఉండాల్సిందే. కానీ ఆ పారదర్శకతకు రాజకీయ రంగులు పులిమితేనే అసలు సమస్య మొదలవుతుందనే అభిప్రాయాలు ప్రస్తుతం పార్టీలు అనుసరిస్తున్న విధానాలపై వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు రేవంత్ కు బీఆర్ఎస్ నేతల ఆస్తుల గురించి మాట్లాడేటప్పుడు కనిపించే ఉత్సాహం.. బీజేపీ నేతల విషయానికి వచ్చేసరికి ఎందుకు కనిపించడం లేదనే విమర్శ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కార్పొరేటర్‌గా పోటీ చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నుంచి ఎదిగానని బండి సంజయ్ గతంలో చెప్పిన విషయాన్ని రేవంత్ రెడ్డి మరచినట్టు ఉన్నారనే సైటర్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారంలోకి వస్తున్నాయి.

అలాగే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ నాయకుడు రఘునందన్ రావు రాజకీయ ప్రస్థానం, న్యాయవాద వృత్తి, మీడియా రంగంతో ఆయనకు ఉన్న అనుబంధం, ఆయన ప్రకటించిన ఆస్తుల వివరాలపైనా సమగ్ర చర్చ జరగాల్సిందే. అదే విధంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాపార ప్రయోజనాలు, ఆర్థిక వ్యవహారాలపై కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా విశ్లేషణ జరగాలి. రాజకీయంగా ఎవరు దగ్గర.. ఎవరు దూరం అనే తేడా లేకుండా ఒకే విధమైన పరిశీలన ఉండాలన్నదే ప్రజాస్వామ్య డిమాండ్..

అందుకే బీఆర్ఎస్ నేతల ఆస్తుల విషయంలో రేవంత్ వ్యవహారం ఒకతీరుగా.. బీజేపీ నేతల విషయంలో మరొకలా వ్యవహరించడం రాజకీయాల్లో చర్చాంశనీయమైంది.. టూకీగా చెప్పాలంటే పిట్టల దొరకు ఎక్కువ.. ఫకీర్ కు తక్కువ అన్నట్టుగా సీఎం తీరు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.. మరోవైపు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలు, ఆ పార్టీ నేతల ఆస్తుల పెరుగుదలపై ప్రశ్నలు సంధించడం కాంగ్రెస్‌కు రాజకీయ మైలేజ్ కు ఉపయోగపడవచ్చు..

గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఉంటే వాటిని విచారించడం కూడా ప్రభుత్వ బాధ్యతే. కానీ అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల విషయంలోనూ సమానమైన పారదర్శకత కోరితేనే ప్రభుత్వ వైఖరికి విశ్వసనీయత పెరుగుతుంది. లేదంటే ఆస్తుల చర్చ అవినీతిపై పోరాటం కంటే ప్రత్యర్థులను రాజకీయంగా లక్ష్యంగా చేసుకునే మైండ్ గేమ్‌గా మారిందనే విమర్శలకు అవకాశం ఏర్పడుతుంది.

ఇక ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో ఎండల మంటలు, కరవు పరిస్థితులు, ప్రజా సమస్యలతో రాష్ట్రం అల్లాడిపోతుంటే, ప్రభుత్వం మాత్రం ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆస్తుల వివాదాలను తెరపైకి తెస్తోందనే ఆరోపణలున్నాయి. కేవలం బీఆర్ఎస్‌ను మాత్రమే టార్గెట్ చేస్తూ, బీజేపీ నేతల అక్రమాస్తులపై ఉద్దేశపూర్వకంగానే కళ్లు మూసుకుంటున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి..

ఇలాంటి సమయంలో ప్రజలకు కావాల్సింది ఆస్తులపై రాజకీయ ఆరోపణలు కాదు.. పాలనపై స్పష్టమైన సమాధానాలు. ఎవరెవరు ఎంత సంపాదించారనే చర్చతో పాటు, ప్రజలకు ప్రభుత్వం ఏం అందించింది.. రాబోయే వేసవి సవాళ్లను ఎలా ఎదుర్కోబోతోంది.. రైతులకు, సామాన్యులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతోంది అనే అంశాలపైనా అదే స్థాయిలో దృష్టి పెట్టాలనే అభిప్రాయాలు ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి.

ఇక బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా.. ప్రజాప్రతినిధుల ఆస్తుల విషయంలో ప్రభుత్వానికి ఒకే ప్రమాణం ఉండాలి. ఆధారాలుంటే బయటపెట్టండి.. ఆరోపణలుంటే విచారించండి.. తప్పు నిరూపితమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. అదే సమయంలో తెలంగాణకు పోంచిఉన్న ముప్పు నుండి సమస్యల నుండి ప్రజలను కాపాడండి.. లేదంటే లక్షల్లో జీతాలు అందుకునే మీకు అర్థం లేకుండా పోతుందని అంటున్నారు..

#TelanganaPolitics#RevanthReddy#BJRSRightOrWrong#BJPvsBRSvsCongress#TelanganaAssembly#BandiSanjay#RaghunandanRao#PoliticalMindGame
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి