ఒక కేసులో అప్పీల్ దాఖలు చేయడానికి ఏకంగా 250 రోజుల కాలయాపన చేసిన తెలంగాణ పాఠశాల విద్యాశాఖపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్య వైఖరిని తప్పుబడుతూ విద్యాశాఖకు రూ.25వేల జరిమానా విధిస్తూ డివిజన్ బెంచ్ చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ జరిమానా మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా, అప్పీల్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆలస్యానికి కారకులైన అధికారుల జీతాల నుంచే వసూలు చేయాలని స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లోని వివేక వర్ధిని ఎయిడెడ్ పాఠశాలలో పని చేసిన కె.గిరీశ్ అనే ఉపాధ్యాయుడు తన సర్వీసును గ్రాంట్ ఇన్ ఎయిడ్ పరిధిలోకి తీసుకొచ్చి క్రమబద్ధీకరించాలని (రెగ్యులరైజ్) కోరుతూ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణను చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే, సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసే సమయానికే సదరు ఉపాధ్యాయుడు గిరీశ్ మరణించారు. మరణించిన వ్యక్తి సర్వీసును రెగ్యులరైజ్ చేస్తూ ఇచ్చిన తీర్పు చెల్లదని పేర్కొంటూ విద్యాశాఖ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.
అయితే, ఈ అప్పీల్ పిటిషన్‌ను నిర్దేశిత పరిమితి కాలం (Limitation Period) ముగిసిన తర్వాత ఏకంగా 250 రోజుల వ్యవధి దాటిన పిమ్మట దాఖలు చేయడంపై డివిజన్ బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల న్యాయవ్యవస్థ సమయం వృథా కావడమే కాకుండా, ప్రభుత్వానికి అనవసర వ్యయం పెరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ ఆలస్యానికి బాధ్యులెవరో తేల్చేందుకు విచారణ జరిపించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.
ఈ మేరకు విధించిన రూ.25వేల జరిమానా మొత్తాన్ని రెండు వారాల్లోగా చెల్లించాలని స్పష్టం చేసిన హైకోర్టు, ఆ తర్వాతే విద్యాశాఖ అప్పీల్‌పై పూర్తి విచారణ జరుపుతామని తేల్చిచెప్పింది. విద్యాశాఖ తరఫున బలమైన వాదనలు ఉన్నందున సింగిల్ జడ్జి ఇచ్చే ఉత్తర్వులపై తాత్కాలిక స్టే విధిస్తూ, కేసులోని ప్రైవేటు ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానాల ఆదేశాలు, అప్పీళ్ల పట్ల అధికారులు ఇకనైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ తీర్పు ద్వారా హెచ్చరించింది.












