ఎల్ నినోపై హెచ్చరించినా ఆలోచించలేదు
సూపర్ ఎల్ నినోని ఎలా తట్టుకుంటారు?
ఆంధ్రా దోచుకెళ్తున్న నీళ్లపై సోయి లేకపాయే?
కరెంట్‌పై కంట్రోల్ లేకపాయే?
వాతావారణంలో మార్పులపై ధ్యాసే లేదు?
ఇలా అయితే ఎలా అంటున్న తెలంగాణ ప్రజలు
స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి తరచూ హెచ్చరిస్తున్నా మొద్దు నిద్రలో వ్యవస్థ?
కొన ప్రాణంలో రైతాంగం ఉంటే రివ్యూలు ఏవి?
పంట భీమాకు పైసలు కట్టారా?
రైతు కుటుంబాల బతుకు భరోసాకు భద్రత ఉందా?
మహా కరువుని అంచనా వేయలేని ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత అని అడుగుతున్న రైతులు
జెన్ జీ ఉద్యమం రైతుల రూపంలో రానుందా?
30 శాతం కమీషన్స్‌లో ఉన్న ప్రభుత్వం ఇకనైనా మేలుకోకపోతే మీ కర్మ?
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
స్వేచ్చ న్యూస్ చైర్మన్
తెలంగాణ రైతాంగానికి ప్రకృతి పరీక్ష పెట్టబోతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.. ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావ పరిస్థితులు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. సాగునీటి అవసరాలు.. విద్యుత్ డిమాండ్.. ఇవన్నీ రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి సవాళ్ళు విసరనున్నాయనే చర్చ మొదలైంది.. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళిక అవసరమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..
ఇదే సమయంలో ప్రకృతి విసురుతున్న ఈ సవాళ్ళు ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు సిద్ధంగా ఉంది? క్షేత్రస్థాయిలో రైతులకు అందుతున్న భరోసా ఎంత? అనే సందేహాలు పుడుతున్నాయి. మరోవైపు ఎల్‌నినో ప్రభావం తీవ్రతరం కావచ్చని, 2026 వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ముందుగానే అంచనాలు వేసి హెచ్చరించింది.
అదేవిధంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉందని కేంద్రం కూడా పార్లమెంటుకు తెలిపింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణలో జిల్లా స్థాయి కార్యాచరణ పటిష్టం చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కాలానుగుణంగా ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలి? ఎక్కడ నీటి కొరత వచ్చే ప్రమాదం ఉంది? ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు సిద్ధంగా ఉన్నాయా? పంట నష్టపోయే రైతులకు పరిహారం ఎలా అందించాలి? అనే అంశాలపై ప్రభుత్వం మొద్దునిద్ర ప్రదర్శించిందనే తీవ్ర విమర్శలు రైతుల నుండి వినిపిస్తున్నాయి.
ముందు చూపు లేని ప్రభుత్వం అనే నిందలు పడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ, పంటల కొనుగోలు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెబుతోంది. వ్యవసాయ రంగానికి భారీగా నిధులు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ఇవి క్షేత్ర స్థాయిలో అమలవుతున్నాయా? అనే ప్రశ్నలు పుడుతున్నాయి. అలాగే రాబోయే వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ ఎంతవరకు సిద్ధమైందనే క్లారిటీ లేకుండా పదవులు, అధికారం చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి..
ఇక సాగునీటి విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న జలవివాదాలు కూడా చర్చకు వస్తున్నాయి. తెలంగాణకు కేటాయించిన నీటి వినియోగం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, భవిష్యత్తు అవసరాలపై ప్రభుత్వం స్పష్టమైన వివరాలు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. నీటి లభ్యత తగ్గితే తాగునీరు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తిపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయాలి.
విద్యుత్ విషయంలోనూ ఇదే పరిస్థితి. ఎండలు ముదిరితే వ్యవసాయ పంపుసెట్ల వినియోగం పెరుగుతుంది. నీటి సరఫరా కోసం అదనపు విద్యుత్ అవసరం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో కోతలు లేకుండా సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? విద్యుత్ సంస్థలతో సమీక్షలు, అవసరమైన కొనుగోళ్లు, సరఫరా ప్రణాళికలు ఏ దశలో ఉన్నాయి? అనే అంశాలపై ప్రజలకు సమాధానాలు కావాలనే టాక్ వినిపిస్తుంది.
అలాగే ప్రకృతి వైపరీత్యాలతో పంట దెబ్బతింటే రైతుకు నష్టపరిహారం అందే వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తోంది? ఏ పంటలకు బీమా వర్తిస్తోంది? ఎంతమంది రైతులు నమోదు చేసుకున్నారు? క్లెయిమ్‌ల పరిష్కారానికి ఎంత సమయం పడుతోందనే వివరాలను ప్రభుత్వం పారదర్శకంగా వెల్లడించాలనే డిమాండ్ పెరుగుతుంది. అదేవిధంగా రైతు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే రైతు బీమా, పంట నష్టాన్ని కవర్ చేసే పంటల బీమా రెండింటి అమలుపైనా స్పష్టత అవసరం అంటున్నారు.
ఇదే సమయంలో రైతు కుటుంబాల భవిష్యత్తుపై ఆందోళన పెరిగితే, ఆ అసంతృప్తిని పాలకులు తక్కువగా అంచనా వేయకూడదు. యువతలో కనిపిస్తున్న నిరసన ధోరణి తరహాలోనే రైతుల సమస్యలు కూడా సంఘటిత ఉద్యమాలకు దారితీస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. అందుకే రైతుల సమస్యలకు సకాలంలో స్పందించకపోతే ప్రజా అసంతృప్తి పెరిగే ప్రమాదం మాత్రం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక రాష్ట్రంలో నెలకొంటున్న కరువు పరిస్థితులపై స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి తరచూ హెచ్చరిస్తున్నా మొద్దు నిద్రలో వ్యవస్థ ఉందని అనుకొంటున్నారు.. మహా కరువుని అంచనా వేయలేని ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత అని అడుగుతున్న రైతులకు ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారు?.
ఇలా నిర్లక్ష్య ధోరణిలో ఉంటూ.. ప్రజాప్రభుత్వం అంటూ గాలి కబుర్లు చెబుతూ వాటిని కాగితాలకే పరిమితం చేస్తే తెలంగాణను ఏం చేద్దాం.. అనుకుంటున్నావ్.. రేవంత్? అనే ప్రశ్నలు పుడుతున్నాయి.. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందనే హెచ్చరికలు ప్రజల్లో వినిపిస్తున్నాయి!!..












