3.7 డిగ్రీల మార్క్ దాటనున్న సెగ
పీక్ స్టేజ్‌లోకి అడుగు.. 2027 ఫిబ్రవరి వరకు ముప్పు
ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం?
అసలేంటీ 'సూపర్ డూపర్ ఎల్ నినో'?
స్వేచ్ఛ న్యూస్, హైదరాబాద్
శీతాకాలంలో చలి గాలులు వీచాల్సిన వేళ భానుడు భగ్గుమంటున్నాడు. కాలచక్రం గతి తప్పి మధ్యాహ్నపు ఉష్ణోగ్రతలు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటివరకు సాధారణ ఎల్‌నినోగా స్టార్ట్ అయిన ప్రకృతి వైపరీత్యం.. క్రమంగా ‘సూపర్ ఎల్‌నినో’గా, ఆపై ‘గాడ్జిల్లా ఎల్‌నినో’గా మారి, ఇప్పుడు విశ్వరూపం దాల్చింది. ఏకంగా 150 ఏళ్ల క్రితం నాటి చేదు రికార్డులను సైతం తుడిచిపెట్టేస్తూ భూమండలంపై ‘సూపర్ డూపర్ ఎల్‌నినో’ విరుచుకుపడుతోంది. ప్రపంచ వాతావరణ సంస్థతో పాటు అంతర్జాతీయ వాతావరణ పరిశోధకులు వెల్లడిస్తున్న తాజా నివేదికలు యావత్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
3.7 డిగ్రీల మార్క్ దాటనున్న సెగ
రానున్న మూడు నెలల్లో ఈ సూపర్ డూపర్ ఎల్‌నినో తీవ్రత మునుపెన్నడూ చూడని స్థాయికి చేరనుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 3.7 డిగ్రీల సెల్సియస్ దాటే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకసారి చరిత్రను తిరగేస్తే.. సరిగ్గా 1876-78 మధ్య కాలంలో సంభవించిన భయంకర ఎల్‌నినో విపత్తు వల్ల ఆసియా ఖండంలో తీవ్ర కరువు కాటకాలు ఏర్పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత విపత్తు ఆనాటి తీవ్రతను కూడా మించిపోవచ్చని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇస్తున్నారు.
అసలేంటీ 'సూపర్ డూపర్ ఎల్ నినో'?
భూమధ్యరేఖ వెంబడి దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలోని పెరూ, ఈక్వెడార్ సమీప పసిఫిక్ మహాసముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కినప్పుడు సముద్ర గాలుల దిశ మారుతుంది. పశ్చిమానికి వీయాల్సిన గాలులు తూర్పు వైపు పయనించడంతో భారత్, ఆసియా దేశాల్లో వర్షపాతం గణనీయంగా పడిపోతుంది. నార్మల్‌గా సముద్ర జలాల ఉష్ణోగ్రత 0.5 డిగ్రీల సెల్సియస్ పెరిగితేనే ఎల్‌నినోగా నిర్ధారిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితి దానికి ఏడు రెట్లు పెరిగి ఏకంగా 3.5 డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోయింది. దీంతో ఇది సాధారణ ఎల్‌నినో స్థాయిని దాటి ‘సూపర్ డూపర్ ఎల్‌నినో’గా రూపాంతరం చెందిందని చెబుతున్నారు. 0.5 నుంచి 1.0 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్నప్పుడు బలహీన ఎల్‌నినో అంటారని, అదే 1.0 నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటే మీడియం ఎల్‌నినోగా పిలుస్తారని చెబుతున్నారు. అదే 1.5 నుంచి 2.0 డిగ్రీల సెల్సియస్‌గా రూపాంతరం చెందింతే బలమైన ఎల్‌నినో పేర్కొంటున్నారు. 2.0 నుంచి 3.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయితే దానిని సూపర్ ఎల్‌నినో శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. 3.0 నుంచి 3.5 డిగ్రీల సెల్సియస్‌గా మారితే గాడ్జిల్లా ఎల్‌నినో అని చెబుతున్నారు. 3.5 డిగ్రీల సెల్సియస్ అంతకంటే ఎక్కువగా ఉంటే దానిని సూపర్ డూపర్ ఎల్‌నినోగా పిలుస్తున్నారు.
పీక్ స్టేజ్‌లోకి అడుగు.. 2027 ఫిబ్రవరి వరకు ముప్పు
యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ నివేదిక రికార్డ్స్ ప్రకారం.. అక్టోబర్ మూడో వారం నుంచే ఎల్‌నీనో ఫస్ట్ స్టేజ్ స్టార్ట్ కానుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ లాస్ట్ నాటికి ఇది 82 శాతంతో పీక్స్‌కి చేరుకుంటుందని అంటున్నారు. అత్యంత ఆందోళనకరమైన విషయమేమిటంటే.. ఈ విలయం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే ప్రమాదం ఉందని అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం?
ఈ పెను మార్పు భారత్ వంటి వ్యవసాయాధారిత దేశాలపై పిడుగుపాటులా మారే అవకాశముందని చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో సాధారణ వర్షపాతం దారుణంగా పడిపోనుంది. మరోవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో వడగాడ్పులు విరుచుకుపడతాయి. మన దేశంలో దాదాపు 65 నుంచి 70 శాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి వానకాలంపైనే ఆధారపడి ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి రాబోయే రోజుల్లో తీవ్ర ఆహార సంక్షోభం, ధరల పెరుగుదల తప్పకపోవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్, హవాయి తీరాల్లో రాక్షస తుపాన్లు చెలరేగే ప్రమాదం ఉండగా, అట్లాంటిక్ మహాసముద్రంలో మాత్రం తుపాన్ల ఉద్ధృతి తగ్గే విచిత్ర పరిస్థితులు నెలకొంటాయని చెబుతున్నారు. గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్, అటవీ విధ్వంసంతో మానవాళి చేస్తున్న స్వయంకృతమే ఇప్పుడు భూగోళాన్ని అగ్నిగుండంగా మారుస్తోందని చెబుతున్నారు. ప్రకృతి ప్రకోపానికి నిదర్శనమైన ఈ ‘సూపర్ డూపర్ ఎల్‌నినో’ ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు అత్యవసర ప్రణాళికలు రెడీ చేయాల్సిన టైం దగ్గరపడిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.












