తమిళనాడులో ఇటీవల జరిగిన మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో అధికార తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ఘనవిజయం సాధించింది. ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్(CM vijay) నాయత్వంలోని టీవీకే అభ్యర్థులు ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందడంతో, శాసనసభలో ఆ పార్టీ బలం 107 నుంచి 109కి పెరిగింది. అన్నాడీఎంకే తరఫున గతంలో గెలిచి, ఆ పార్టీకి రాజీనామా చేసి టీవీకేలో చేరిన మరగతం కుమారవేల్ (మధురాంతకం), పి.సత్యభామ (ధారాపురం) మళ్లీ అదే స్థానాల నుంచి 'విజిల్' గుర్తుపై పోటీ చేసి విజయం సాధించడం విశేషం.
మధురాంతకంలో టీవీకే అభ్యర్థి మరగతం కుమారవేల్ తన సమీప డీఎంకే అభ్యర్థిపై 19,241 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, ధారాపురంలో పి. సత్యభామ 9,471 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేశారు. ఈ రెండు స్థానాల్లోనూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే మూడో స్థానానికి పడిపోగా, డీఎంకే రెండో స్థానంతో సరిపెట్టుకుంది. సీఎం విజయ్ నాలుగు నెలల పాలనకు ప్రజలు ఇచ్చిన మద్దతు ఇదేనని కాంగ్రెస్ నేతలు పేర్కొంటుండగా, ఇది అనైతిక రాజకీయాలతో సాధించిన విజయమని డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ విమర్శించారు.
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు లేదా సాధారణ మెజారిటీకి 118 స్థానాలు అవసరం. ఉపఎన్నికల గెలుపుతో టీవీకే బలం 109కి చేరినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా 9 స్థానాల దూరం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ (5 స్థానాలు), వీసీకే, వామపక్షాలు, ఇతర మిత్రపక్షాల మద్దతుతోనే సీఎం విజయ్ మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. భవిష్యత్తులోనూ ప్రభుత్వ స్థిరత్వం పూర్తిగా మిత్రపక్షాల సహకారం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుపైనే ఆధారపడి ఉంది.












