దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతిపాదించిన భారీ నిరసన కార్యక్రమం నేపథ్యంలో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, నిరసనకారులు పెద్ద ఎత్తున జంతర్ మంతర్‌కు తరలివస్తారనే పక్కా సమాచారంతో రాజధానిని ఒక సైనిక కోటగా మార్చేశారు. ఈ భద్రతా ఆంక్షలతో మధ్య ఢిల్లీలో అప్రకటిత బంద్ వాతావరణం నెలకొంది.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌తో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చాయి. అయితే, నిరసన సమాచారాన్ని కేవలం మూడు రోజుల ముందే ఇచ్చారని, గత నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఈ ఆందోళనకు అనుమతి నిరాకరించారు.
ఆందోళనను భగ్నం చేసేందుకు పోలీసులు అసాధారణ రీతిలో 20వేల మందికి పైగా కేంద్ర బలగాలు, పోలీస్ సిబ్బందిని మోహరించారు. జంతర్ మంతర్, జన్ పథ్, ఎన్నికల సంఘం కార్యాలయం, పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరిసరాల్లో 1.5 కిలోమీటర్ల మేర అత్యంత సున్నితమైన జోన్‌గా ప్రకటించి ఏడు అంచెల బారికేడ్లు ఏర్పాటు చేశారు. 300సీసీటీవీ కెమెరాలు, పోలీసుల బాడీ కెమెరాల ద్వారా నిరంతరం కంట్రోల్ రూమ్ నుంచి నిఘా పెడుతున్నారు. నిరసనకారులను తరలించేందుకు 12తాత్కాలిక కస్టడీ కేంద్రాలను కూడా సిద్ధం చేశారు.
ఈ భారీ భద్రతా ఆంక్షల వల్ల సాధారణ ప్రజలు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. మధ్య ఢిల్లీలో 4 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయగా, 45కి పైగా మెట్రో స్టేషన్లలో రాకపోకలు నిలిచిపోయాయి. ఢిల్లీకి వచ్చే 254 రైళ్లను రద్దు చేయడంతో పాటు 30కి పైగా ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. కాగా, ప్రజారవాణాపై ఆంక్షలు పరిమితంగా ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పటికీ, కేంద్రం కఠిన నిఘా కొనసాగిస్తుండటంపై సీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












