తెలంగాణ

Telangana: తెలంగాణలో ఏసీబీ ఉక్కుపాదం.. మూడేళ్ల అవినీతి ఆస్తుల లెక్కలు ఇవే!..

రచన: Venu••9 నిమిషాల పఠనం

తెలంగాణలో ఏసీబీ అవినీతి అధికారుల భరతం పడుతోంది.. లంచగొండులు, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న అవినీతి నిరోధక శాఖ వలలో తాజాగా మరో భారీ తిమింగళం పడింది..

తెలంగాణలో ఏసీబీ అవినీతి అధికారుల భరతం పడుతోంది.. లంచగొండులు, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న అవినీతి నిరోధక శాఖ వలలో తాజాగా మరో భారీ తిమింగళం పడింది.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మహబూబాబాద్ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వాసంశెట్టి నరసింహారావును ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో ఏడు ప్రత్యేక బృందాలు... ఖమ్మంలోని నరసింహారావు నివాసంతో పాటు గరిడేపల్లి, మహబూబాబాద్, నేలకొండపల్లి, హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ తో పాటు మొత్తం ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల ఇళ్లలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక 2011లో సివిల్ సప్లైస్ సంస్థలో ఉద్యోగంలో చేరిన నరసింహారావు పై గతంలో అవినీతి ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన 15 ఏళ్ల సర్వీసులో తన శాలరీ ప్రకారం సంపాదించగల ఆస్తి కేవలం రూ.48 లక్షలు మాత్రమేనని ఏసీబీ అంచనా వేసింది. కానీ, రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే ఏకంగా రూ.9.41 కోట్ల ఆస్తులు కూడగట్టుకున్నట్లు తేలింది. ఇక బహిరంగ మార్కెట్లో వీటి విలువ అక్షరాలా రూ.40 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక గతంలో ఖమ్మం, నిర్మల్, వరంగల్ జిల్లాల్లో పనిచేసినప్పుడు కూడా ఆయనపై అవినీతి ఆరోపణలు రాగా... రెండుసార్లు సస్పెండ్ అయిన చరిత్ర ఉందని తెలుస్తుంది.

మరోవైపు తాజాగా జరిపిన సోదాల్లో ఒక కారు, 331.58 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు, రూ.15,600 నగదును సీజ్ చేసిన ఏసీబీ... నరసింహారావును రిమాండ్‌కు తరలించింది. అదేవిధంగా బినామీల పైనా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక నరసింహారావు కూడగట్టుకున్న స్థిరాస్తుల వివరాలు చూస్తే... ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బల్లెపల్లి, వెలుగుమట్లలో 1,230.16 చదరపు గజాల విస్తీర్ణంలో 5 ఇళ్ల స్థలాలు ఉన్నట్టు తేలాయి.

అలాగే ఖమ్మంలో ఒక G+2, ఒక G+4 భవనం, హైదరాబాద్ ఎల్బీనగర్ బైరామల్‌గూడలో మరో G+2 భవనం ఉన్నాయి. ఇక వ్యవసాయ భూ విషయానికి వస్తే... సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండలో 21.30 ఎకరాలు, నామవరంలో 5.31 ఎకరాలు, గరిడేపల్లి మండలం కల్మలచెరువులో 1.08 ఎకరాల భూములు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. కేవలం నరసింహారావు మాత్రమే కాదు... తెలంగాణలో గడచిన మూడేళ్లుగా అంటే 2024 నుండి 2026 అక్టోబర్ వరకు ఏసీబీ రైడ్స్ లో పట్టుబడిన వారి ఆస్తులు షాకిస్తున్నాయి.

ప్రభుత్వ ధరల ప్రకారమే గత మూడేళ్లలో దాదాపు రూ.250 కోట్లకు పైగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ గణాంకాలను పరిశీలిస్తే... 2024 వ సంవత్సరంలో ఏసీబీ ఏకంగా 11 ఆదాయానికి మించిన ఆస్తుల (DA) కేసులను నమోదు చేసి, నిందితులకు సంబంధించిన రూ.97.42 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.

అదేవిధంగా 2025 వ సంవత్సరంలో మొత్తం 199 కేసులు నమోదు చేయగా.. 273 మంది అధికారులను అరెస్ట్ చేశారు. ఇందులో 15 ప్రధాన డి.ఏ. కేసుల ద్వారా రూ.96.13 కోట్ల అక్రమాస్తులను వెలికితీశారు. ఇక ప్రస్తుత సంవత్సరం జూలై 2026 నాటికే రికార్డు స్థాయిలో 16 డి.ఏ. కేసులు నమోదు కాగా... ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పలువురు ఉన్నతాధికారులను ఏసీబీకి భారీ ఆస్తులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

ఇలా ఇటీవలి కాలంలో భారీగా అక్రమ ఆస్తులతో పట్టుబడిన కొందరు కీలక అధికారుల జాబితా చూస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ పత్రాల్లో వీటి విలువ కోట్లలో ఉన్నప్పటికీ, ఓపెన్ మార్కెట్‌లో వందల కోట్లలో ఉంటుందని దర్యాప్తు సంస్థలు తేల్చాయి.. ఇక గత నెలలో పట్టుబడిన అడిషనల్ సూపరింటెండెంట్, నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ వద్ద రూ.6.13 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు పట్టుబడ్డాయి.

అలాగే ఇబ్రహీంపట్నం తహసీల్దార్ దేశాని శ్రీనివాస్ రెడ్డి పై ఆగస్టు 2026లో జరిగిన ఏసీబీ రైడ్స్ సంచలనం సృష్టించింది. దస్తావేజుల ప్రకారం రూ.6.87 కోట్ల ఆస్తులు దొరగ్గా... బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా! ఇందులో రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్లు, ఒక భారీ పెంట్ హౌస్, 10 ఎకరాల భూమి, ఒక బార్ అండ్ రెస్టారెంట్‌లో రూ.86 లక్షల పెట్టుబడులు ఉన్నట్లు తేలింది.

ఇక రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎం. వెంకట భూపాల్ రెడ్డి నివాసాలపై దాడి చేసిన ఏసీబీ... రూ.5.05 కోట్ల అక్రమాస్తులను సీజ్ చేసింది.. వీళ్ళే కాకుండా మరికొందరు కీలక అధికారులు కూడా ఉన్నారు. వారిలో HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ.. ఇతని కేసు ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ అక్రమాస్తుల కేసుగా వెలుగులోకి వచ్చింది. ఈయన వద్ద ఏకంగా రూ. 250 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. ఇందులో 214 ఎకరాల వ్యవసాయ భూమి, 29 ప్లాట్లు, వివిధ ప్రాంతాల్లో 7 అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు, ఒక విల్లా ఉన్నట్లు ఏసీబీ తేల్చింది.

అలాగే మెహదీపట్నం, జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత నిర్మాణ అనుమతుల కోసం ఏకంగా రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ కాలంలో సంచలనం సృష్టించిన లంచం కేసుగా ఇది మారింది. ఇదే సంవత్సరంలో కరీంనగర్, నారాయణపేట తదితర ప్రాంతాలకు చెందిన పలువురు రెవెన్యూ, విద్యుత్ మరియు ఇతర శాఖల అధికారులకు సంబంధించిన ఇళ్లపై కూడా ఏసీబీ దాడులు జరిగాయి.

బినామీ పేర్లతో రైస్ మిల్లులు, కర్ణాటక, అనంతపురం తదితర ప్రాంతాల్లో భారీగా భూములున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు.. వీరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ ప్రభుత్వ శాఖలోని అధికారులు భారీగా ఆక్రమాస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ గుర్తించి నిర్వహించిన దాడుల్లో ఎందరో పట్టుబడ్డారు.

ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగంతో వచ్చే సంపాదనతో సరి పెట్టుకోక అత్యాశకు పోయి ఆక్రమాస్తులతో పరువు పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్టుపెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడితే... బినామీల పేరిట ఆస్తులు దాచినా, ఎవ్వరినీ వదిలేది లేదని ఈ వరుస దాడులు స్పష్టం చేస్తున్నాయి. అవినీతికి పాల్పడే అధికారులకు నిద్రలేకుండా చేస్తున్నాయి!..

#Khammam#ACBTraps#TelanganaACB#DisproportionateAssets#CorruptOfficersArrested#TelanganaNews#CivilSuppliesDMArrest#AntiCorruptionBureau#TelanganaCrimeNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి