Tollywood: కొత్తగా వచ్చే సినిమాకి టికెట్ రేట్లు పెంచడం అనేది సర్వ సాధారణం అయిపోయింది. 100 కోట్లు దాటితే, ఆ సినిమాకి టికెట్ రేట్లను పెంచేస్తున్నారు. ప్రీమియర్స్ అని, బెనిఫిట్ షోస్ అని 500 నుంచి 1000 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. దీని వల్ల అభిమానులకే ఈ స్పెషల్ షోస్ తప్ప కామన్ ఆడియన్‌కి కాదని అర్థమవుతోంది. పోనీ సినిమా టికెట్ ఖరీదు ఉంటుందా.! అంటే అదీ లేదు. అసలు, టికెట్ రేట్లను ఎందుకు పెంచాలి.?
సినిమా బావుంటే వందల కోట్లు వసూళ్ళు చేస్తుందని ఇటీవల వచ్చిన రవితేజ ఇరుముడి సినిమా నిరూపించింది. ఎలాంటి టికెట్ హైక్ లేకుండానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల వసూళ్ళను రాబట్టింది. అదే, టికెట్ హైక్ తో వచ్చిన టాక్సిక్, ది ప్యారడైజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తిరగబడ్డాయి. టాక్సిక్ సినిమా అయితే, మరీ దారుణం అని చెప్పాలి. భారీ డిజాస్టర్ కిందే తోసేశారు.
ఇక్కడ, ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే పర భాషా చిత్రాలకి కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ హైక్ ఇస్తున్నారు. ఇదీ మరీ విడ్డూరంగా ఉంది. కన్నడ, సినిమాకి మన దగ్గర హైక్ ఎందుకు అన్నవాళ్ళ మాటలను కూడా లెక్క చేయడం లేదు. ఇప్పుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ 2 సినిమాకి ఏపీ, తెలంగాణాలలో టికెట్ హైక్ ఇచ్చారు. దీంతో, ఈ సినిమా చూడాలన్న ఆసక్తి మన తెలుగు ఆడియన్స్‌లో తగ్గిపోతుంది.
మన తెలుగు సినిమాలకే టికెట్ హైక్ పెడితే వసూళ్ల మీద గట్టిగా ప్రభావం చూపిస్తోంది. నార్మల్ రేట్ వచ్చాక చూద్దాం లే..అని ఆడియన్స్ థియేటర్స్‌కి రాకుండా వెనక్కి తగ్గుతున్నారు. ఈలోపు సినిమా హిట్ టాక్ వస్తే ఓకే. కానీ, అలా వచ్చే సినిమాలే కరువయ్యాయి. మొదటిరోజే డివైడ్ టాక్ వస్తోంది. దాంతో, జనాలు పూర్తిగా సినిమా చూడటానికి ఆసక్తి చూపడం లేదు. మూడవ రోజునుంచే థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి. ముందులాగా, టికెట్ ప్రైస్ అందరికీ అందుబాటులో ఉంటే..ఇరుముడి సినిమాకి వచ్చినట్టుగా హిట్ టాక్ తెచ్చుకున్న ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. లేదంటే ప్యారడైజ్ సినిమాకి వచ్చినట్టుగా నష్టాలు తప్పవు.












