ఏపీ

TTD: ఆ రూమర్లకు చెక్ పెట్టిన టీటీడీ.. మా ఆన్‌లైన్ సిస్టమ్ పక్కా సేఫ్!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

TTD: శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ వ్యవహారంపై సోషల్ మీడియాలో జోరుగా వస్తున్న రూమర్స్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గట్టిగా క్లారిటీ ఇచ్చింది. తమ ఆన్‌లైన్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా, పూర్తి భద్రతా ప్రమాణాలతో పనిచేస్తోందని స్పష్టం చేసింది.

TTD: శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ వ్యవహారంపై సోషల్ మీడియాలో జోరుగా వస్తున్న రూమర్స్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గట్టిగా క్లారిటీ ఇచ్చింది. తమ ఆన్‌లైన్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా, పూర్తి భద్రతా ప్రమాణాలతో పనిచేస్తోందని స్పష్టం చేసింది. టికెట్ లభించకపోవడానికీ, వ్యవస్థలో లోపాలు ఉండటానికీ మధ్య చాలా వ్యత్యాసం ఉందని పేర్కొంటూ ఆధారాలతో సహా లెక్కలు విడుదల చేసింది.

పోటీ తీవ్రం.. అందుబాటులో తక్కువ

టికెట్లు నిమిషాల వ్యవధిలోనే ఎందుకు అయిపోతున్నాయో టీటీడీ అధికారిక గణాంకాలతో సహా వివరించింది. టికెట్ల విడుదల సమయంలో ఒకేసారి దాదాపు 6 లక్షల మంది యూజర్లు వెబ్‌సైట్‌లోకి వస్తున్నారు. ఒక్కొక్కరు సగటున 4 టికెట్ల కోసం ప్రయత్నిస్తుండటంతో, క్షణాల వ్యవధిలోనే 24 లక్షల టికెట్లకు డిమాండ్ ఏర్పడుతోంది. దేవస్థానం వద్ద నెలకు అందుబాటులో ఉండేది దాదాపు 2.69 లక్షల టికెట్లు మాత్రమే. అంటే అందుబాటులో ఉన్న కోటా కంటే 9 రెట్లు అధికంగా పోటీ ఉంటోంది.

ఒకే స్లాట్ కోసం వేలాది మంది ఏకకాలంలో ప్రయత్నించడం వల్ల కొన్ని క్షణాల్లోనే బుకింగ్స్ పూర్తయిపోతాయి. ఇలాంటి సమయంలో స్క్రీన్‌పై 'Slot Unavailable' అని కనిపించడం సహజం తప్ప, అది తమ ఆన్‌లైన్ వ్యవస్థ వైఫల్యం ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పింది.

టెక్నికల్ వార్-రూమ్.. పటిష్ట భద్రతా వలయం

బుకింగ్ వ్యవస్థలో ఎలాంటి లోపాలు లేవని, తమ ఆన్‌లైన్ సర్వీస్‌ల కోసం అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు వాడుతున్నామని టీటీడీ వెల్లడించింది. ట్రాఫిక్ పెరిగినప్పుడు సర్వర్లు మొరాయించకుండా, క్రమపద్ధతిలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకే 'వర్చువల్ క్యూ'ను వాడుతున్నారు. ఇది టికెట్లు ఆపడానికి కాదు, సిస్టమ్ క్రాష్ కాకుండా కాపాడే సాంకేతిక విధానం అని వెల్లడించారు.

బుకింగ్ జరుగుతున్న టైంలో ప్రత్యేకంగా ఒక టెక్నికల్ వార్-రూమ్‌ను ఏర్పాటు చేసి అప్లికేషన్ పనితీరు, సర్వర్ హెల్త్, సైబర్ సెక్యూరిటీని నిరంతరం మానిటర్ చేస్తున్నట్లు తెలిపారు. ఫేక్ యూజర్లు, ఆటోమేటెడ్ బాట్‌లు టికెట్లను బ్లాక్ చేయకుండా అధునాతన యాంటీ-బాట్ టెక్నాలజీతో రక్షణ కల్పించినట్లు చెప్పారు. కొన్ని సందర్భాల్లో పేమెంట్ ఫెయిల్ అవ్వడానికి బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లు, గేట్‌వేలు లేదా యూపీఐ వైఫల్యాలు కారణం కావొచ్చు తప్ప అది టీటీడీ అప్లికేషన్ లోపం కాదని స్పష్టం చేశారు.

పద్మావతి అమ్మవారి ఆలయం సహా ఇతర అనుబంధ ఆలయాల్లోనూ ఇదే ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా టికెట్లు రిలీజ్ చేస్తున్నామని, అక్కడ రద్దీ తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా బుకింగ్స్ పూర్తవుతున్నాయని గుర్తుచేశారు. అత్యంత భారీ డిమాండ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ టికెట్ రావడం సాధ్యం కాదని, ఆ ఒక్క కారణంతో వ్యవస్థను నిందించవద్దని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

#TTD#Tirumala Tirupati Devasthanams#Tirumala#Tirupati#Tirumala Darshan#Rs 300 Special Entry Darshan#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి