తెలంగాణ

KTR: ప్రజల మూడ్ మారింది.. ఎక్కడ చూసినా 'దేఖ్‌ లేంగే' అంటున్నారు: కేటీఆర్

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

KTR: తెలంగాణలోని పల్లెపల్లెనా కాంగ్రెస్ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, ఎక్కడికెళ్లినా ప్రజల నోట ఒకటే నినాదం వినిపిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు.

KTR: తెలంగాణలోని పల్లెపల్లెనా కాంగ్రెస్ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, ఎక్కడికెళ్లినా ప్రజల నోట ఒకటే నినాదం వినిపిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన అనంతరం కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

"కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో తెలుసా?.. ప్రజల గుండెల్లో ఉన్నాడు!"

కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదంటూ ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "కేసీఆర్ ఎక్కడున్నాడు అని కాంగ్రెసోళ్లు అడుగుతుంటారు.. కేసీఆర్ మూడేళ్లు కనబడకపోయినా ప్రజల గుండెల్లో భద్రంగా ఉంటాడు. ఆయన తెచ్చిన సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంట్లో కనిపిస్తున్నాడు" అని అన్నారు. రూ.200గా ఉన్న పింఛన్‌ను రూ.2 వేలు చేసిన ఘనత కేసీఆర్‌దేనని, కాంగ్రెస్ మోసపూరిత మాటలు చెప్పి ఇప్పుడు పాత పింఛనే ఇస్తుండటంతో 46 లక్షల మంది వృద్ధులు, తల్లులు ప్రతిరోజూ కేసీఆర్‌ను మనసారా ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. గతంలో మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని వీధుల్లో కొట్లాడుకునే దుస్థితి ఉండేదని, మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీళ్లు అందించి ఆ కష్టాలు తీర్చిన కేసీఆర్ ప్రతి నీటి బొట్టులో కనిపిస్తున్నారని స్పష్టం చేశారు.

"రైతుబంధు ఎగ్గొట్టిన ప్రతిసారీ కేసీఆరే గుర్తొస్తున్నారు!"

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తుచేసుకుంటున్న తీరును కేటీఆర్ వివరించారు. నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకున్న ఏకైక నేతగా తల్లిదండ్రులు కేసీఆర్‌ను మేనమామలా తలుచుకుంటున్నారని పేర్కొన్నారు.

ఎక్కడో ఉన్న గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా డోర్నకల్, మహబూబాబాద్, సూర్యాపేట, కోదాడ దాకా తరలించి బీడు భూములను సస్యశ్యామలం చేసిన వైనాన్ని రైతులు మర్చిపోలేదన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పంట నాట్లు వేసే సమయానికే రైతుల ఖాతాల్లో 'టింగ్‌ టింగ్‌' మంటూ రైతుబంధు పైసలు జమయ్యేవని, ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతుబంధు ఎగ్గొట్టిన ప్రతిసారీ రైతాంగానికి కేసీఆరే గుర్తొస్తున్నారని మండిపడ్డారు.

ఎకరాకు పైసలు ఇవ్వడానికే మీటింగులు పెడుతూ, అందులో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేకుండా కేవలం కేసీఆర్‌ను తిట్టి నోటి తీట తీర్చుకోవడం తప్ప కాంగ్రెస్ సర్కార్ చేస్తోంది ఏమీ లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని, ఎక్కడికి పోయినా "దేఖ్‌ లేంగే.. కేసీఆరే కావాలి" అంటూ తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సర్కార్‌ను హెచ్చరించారు.

#KTR#KT Rama Rao#BRS#Bharat Rashtra Samithi#Telangana Politics#Congress Government#Revanth Reddy#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి