ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే పార్టీ ఫిరాయించి అనర్హత వేటుతో శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన ఆయనకు కాంగ్రెస్ నుండి ఊహించని షాక్ తగిలినట్టు ప్రచారం మొదలైంది. పార్టీ మరోసారి టికెట్ ఇచ్చేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రోహిన్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వనున్నట్టు పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి..
ఈ మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఖైరతాబాద్‌లో తాజా రాజకీయ సమీకరణాలు, పార్టీ అంతర్గత బలాబలాలు, భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా రోహిన్‌రెడ్డి అభ్యర్థిత్వమే పార్టీకి శ్రేయసరమని సీఎం వివరించినట్టు తెలుస్తుంది. అధిష్ఠానం కూడా దాదాపుగా సుముఖత వ్యక్తం చేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పార్టీ హైకమాండ్ తీరు, టికెట్ కేటాయింపులో జరుగుతున్న అంతర్గత పరిణామాల పట్ల దానం ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన సీఎం నివాసానికి వెళ్లి రెండుసార్లు నేరుగా చర్చించినట్టు సమాచారం.. ఎలాగైనా ఖైరతాబాద్ టికెట్ తనకే దకేలా చూడాలని, ఇప్పటికే తాను ఎమ్మెల్యే పదవి కోల్పోయి రాజకీయంగా సంక్షోభంలో ఉన్నానని సీఎం వద్ద మొరపెట్టుకున్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తుంది.
అయితే ఆ రెండు భేటీల్లోనూ రేవంత్‌రెడ్డి నుంచి దానంకు ఎలాంటి హామీ లభించలేదని పార్టీ వర్గాల నుండి సమాచారం.. మరోవైపు పార్టీ సమీకరణాలు, అధిష్ఠానం నిర్ణయాల మేరకే ఉంటాయంటూ సీఎం దాటవేత ధోరణి ప్రదర్శించడంతో దానం తీవ్ర నిరాశకు లోనవుతున్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తన ముఖ్య అనుచరులతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ వైఖరిపై దానం తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి తనకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయని వాపోయినట్టు తెలుస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ పోటీకి ముందుకు రాని క్లిష్ట సమయంలో పార్టీ పరువు కాపాడేందుకు తాను ధైర్యంగా బరిలోకి దిగానని, గెలిస్తే కేంద్రంలో, ఓడిపోతే రాష్ట్రంలో మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు స్వయంగా ఇచ్చిన మాటను పూర్తిగా తుంగలో తొక్కారని దానం ఆవేదన చెందుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకముందే అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని, సీనియర్ అయిన దానంను విస్మరించారని ఆయన అనుచరులు చెప్తున్నారు. అలాగే నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు వంటి కీలక వ్యవహారాల్లో కూడా స్థానిక నేతగా ఉన్న తనను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. తన 30 ఏండ్ల రాజకీయ జీవితాన్ని, ఎమ్మెల్యే పదవిని కాంగ్రెస్ మాటలు నమ్మి పణంగా పెడితే, చివరికి కనీసం ఉపఎన్నిక టికెట్ కూడా ఇవ్వకుండా బయటకు పంపే కుట్రలు చేస్తున్నారని దానం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక మంత్రి పదవి ఇస్తేనే ఉపఎన్నిక బరిలో దిగుతానని, లేదంటే కాంగ్రెస్‌లో కొనసాగే ప్రసక్తే లేదని తన అనుచరులతో దానం వ్యాఖ్యానించినట్టు సమాచారం. మరోవైపు దానం నాగేందర్ కు అసలు పార్టీ నుంచి టికెట్టే దక్కే పరిస్థితి కనింపించడం లేదనే టాక్ వినిపిస్తుంది. దీంతో దానం రాజకీయ భవిష్యత్తు పై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకత్వం నుంచి భరోసా కొరవడటంతో దానం నాగేందర్ ప్రత్యామ్నాయ దారులపై దృష్టి సారిస్తున్నట్టు సమాచారం. బీజేపీ ఎర్రతివాచీతో స్వాగతం పలుకుతున్నదని ఆయన అనుచరుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది.
అలాగే గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా, కార్యకర్తల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అడుగులు వేస్తానని ఆయన చెప్తున్నట్టు సమాచారం. ఏదేమైనా ఖైరతాబాద్ ఉపఎన్నిక అభ్యర్థిత్వం విషయంలో రోహిన్‌రెడ్డి వైపే రేవంత్‌రెడ్డి మొగ్గు చూపడంతో రాజకీయంగా తన పట్టును నిరూపించుకోవాల్సిన దానం నాగేందర్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారో? అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర చర్చగా మారింది..
మరోవైపు ఖైరతాబాద్ పోరు కాంగ్రెస్‌కే పరిమితం కావడం లేదు. బీఆర్‌ఎస్, బీజేపీలు కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ కనిపించగా.. ఇప్పుడు ఉపఎన్నిక మరోసారి ఆ రాజకీయ సమీకరణాలను పరీక్షించబోతోంది. ఇప్పటికే మూడు పార్టీల్లోనూ అభ్యర్థుల పేర్లపై అంతర్గత చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.
ఇక ఒకవైపు అనర్హత వేటుతో ఖాళీ అయిన సీటు.. మరోవైపు టికెట్ కోసం జరుగుతున్న అంతర్గత రాజకీయ కసరత్తు.. ఇంకోవైపు మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ. ఈ సమీకరణాలన్నీ కలిసిన ఖైరతాబాద్ ఉపఎన్నిక.. తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పునకు కేరాఫ్ గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.








