KTR: తెలంగాణ రాజకీయాలు మరోసారి ఉప ఎన్నిక వేడితో రగులుతున్నాయి. పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్ అనర్హత వేటును సుప్రీంకోర్టు సమర్థించడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ బైపోల్ ఆసక్తి రేపుతున్నప్పటికీ, గులాబీ దళపతి కేటీఆర్‌కు మాత్రం ఇది సాధారణ ఎన్నిక కాదు; తన రాజకీయ భవిష్యత్తును, నాయకత్వ పటిమను తేల్చే జీవన్మరణ సమస్యగా మారనుంది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఎదురైన పరాభవాలు, పార్టీ అధినేత కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్‌కు ఈ ఉప ఎన్నిక పెద్ద సవాలుగా నిలవనుంది.
హైదరాబాద్‌లో హ్యాట్రిక్ ఓటమి భయం
హైదరాబాద్ అంటే బీఆర్‌ఎస్‌కు ఒకప్పుడు కంచుకోట. గ్రేటర్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా గులాబీ జెండా రెపరెపలాడేది. కానీ అధికారం కోల్పోయాక సీన్ రివర్స్ అయింది. గ్రేటర్ పరిధిలో ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అధికార కాంగ్రెస్ దూకుడు ముందు కారు పార్టీ చక్రాలు తిరగలేదు. ఆ రెండు ఉప ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకుని, అభ్యర్థుల ఎంపిక నుంచి క్షేత్రస్థాయి ప్రచారం వరకు అంతా తానై నడిపించింది స్వయంగా కేటీఆరే. అయినప్పటికీ ఫలితాలు మాత్రం పార్టీకి అనుకూలంగా రాలేదు. వరుసగా రెండుసార్లు ఓటమి ఎదురయ్యాక, ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికల బాధ్యత కూడా పూర్తిగా కేటీఆర్ చేతుల్లోనే పడింది. ఇక్కడ కూడా రిజల్ట్ తేడా వస్తే హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు హ్యాట్రిక్ ఓటమి తప్పదన్న టెన్షన్ గులాబీ పార్టీ శ్రేణులను వెంటాడుతోంది.
కేసీఆర్ లేని లోటు.. కేటీఆర్ భర్తీ చేయగలరా?
బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఏ ఉప ఎన్నిక వచ్చినా పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయ చతురత, వ్యూహాలు ప్రత్యర్థులను చిత్తు చేసేవి. అయితే ప్రస్తుతం కేసీఆర్ క్షేత్రస్థాయి రాజకీయాలకు, ప్రచారాలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. ఈ సమయంలో పార్టీ భారం మొత్తం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భుజస్కంధాలపైనే ఉంది. "కేసీఆర్ లేకపోయినా పార్టీని గెలిపించే సత్తా కేటీఆర్‌కు ఉంది" అని క్యాడర్‌కు భరోసా ఇవ్వడానికి ఖైరతాబాద్‌ను మించిన సరైన అవకాశం మరొకటి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ స్థానాన్ని గెలిపించుకోలేకపోతే, పార్టీలో కేసీఆర్ లేని శూన్యాన్ని కేటీఆర్ భర్తీ చేయలేరన్న భావన ప్రజల్లోనే కాకుండా సొంత పార్టీ శ్రేణుల్లోనూ బలపడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వెల్లువెత్తున్నాయి.
నాయకత్వంపై పట్టు నిలుస్తుందా
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పరాజయాల తర్వాత బీఆర్‌ఎస్ అంతర్గతంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పలువురు కీలక నేతలు పార్టీని వీడటానికి నాయకత్వంపై ఉన్న అపనమ్మకమే కారణమన్న విమర్శలు ఉన్నాయి. ఖైరతాబాద్‌లో గులాబీ జెండా ఎగిరితే.. కేటీఆర్ నాయకత్వానికి తిరుగులేదని రుజువవుతుందని అంటున్నారు. ఇదే సమయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇది గట్టి హెచ్చరికగా మారుతుంది. కేటీఆర్ నాయకత్వంపై కేడర్‌లో కొత్త ఉత్సాహం వస్తుందని చెబుతున్నారు.
అలా కాకుండా ఈ బైపోల్‌లోనూ భంగపడితే .. కేటీఆర్ నాయకత్వ పటిమపై సొంత పార్టీ నేతల్లోనే అనుమానాలు మరింత తీవ్రమవుతాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పార్టీపై ఆయన పట్టు సడలిపోవడమే కాకుండా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కేడర్ మరింత డీలా పడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
అధికార బలం, ప్రభుత్వ పథకాలతో దూసుకుపోతున్న కాంగ్రెస్.. మరోవైపు అర్బన్ ఓటర్లపై పట్టున్న బీజేపీ.. ఈ ఇరు పార్టీలను తట్టుకుని ఖైరతాబాద్ కోటపై గులాబీ జెండాను ఎగరేయడం కేటీఆర్‌కు కత్తిమీద సామే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక పోరులో కేటీఆర్ తన రాజకీయ చాణక్యాన్ని నిరూపించుకుని కంచుకోటను కాపాడుకుంటారా? లేక మరో పరాభవాన్ని తన ఖాతాలో వేసుకుంటారా? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.







