తెలంగాణ

TG: మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్‌రెడ్డి

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

TG: మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపకర్త డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్‌ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.

TG: మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపకర్త డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్‌ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ పురోగతికి బాటలు వేసిన మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అడ్డంకి ఏంటని సూటిగా ప్రశ్నించారు.

పార్టీలకు అతీతంగా మేధావులను గుర్తించాలి

రాజకీయ విభేదాలను పక్కనబెట్టి మేధావుల సేవలను స్మరించుకోవడమే నిజమైన పరిణితి అని సీఎం పేర్కొన్నారు. "దేశం క్లిష్ట ఆర్థిక, రాజకీయ ఒడిదొడుకుల్లో చిక్కుకున్న సమయాల్లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకుని పాలనను గాడిన పెట్టారు. మౌనంగా ఉంటూనే పరిపాలనలో విప్లవాత్మక నిర్ణయాలు అమలు చేశారు. అలాంటి మహోన్నత వ్యక్తికి ఇప్పటివరకు భారతరత్న దక్కకపోవడం బాధాకరం. ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించి మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలి" అని విజ్ఞప్తి చేశారు.

పీవీ-మన్మోహన్ జోడీ వల్లే సంస్కరణలు

దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చడంలో దివంగత ప్రధాని పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయం కీలక పాత్ర పోషించిందని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. పీవీ ప్రధానిగా, మన్మోహన్ ఆర్థిక మంత్రిగా తెచ్చిన ఆర్థిక విధానాలే నేడు భారతదేశాన్ని ప్రపంచంలోనే పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా నిలిపాయన్నారు. వారిద్దరూ ఆనాడు వేసిన పునాదుల ఫలితంగానే నేడు హైదరాబాద్‌లో ఈ స్థాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లు, బహుళజాతి కంపెనీల ప్రాంగణాలు వెలిశాయని గుర్తు చేశారు. గతంలో భూగరిష్ఠ పరిమితి చట్టాల్లోని లొసుగులను సరిదిద్దుతూ, రైతులు, నిర్వాసితుల అంగీకారం తప్పనిసరి చేస్తూ మన్మోహన్ సర్కార్ సమగ్ర భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చిందని వివరించారు. మన్మోహన్ సింగ్ ప్రయాణం నేటి యువతరానికే కాకుండా భవిష్యత్ తరాలన్నింటికీ గొప్ప పాఠమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారత సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

#Telangana#CM Revanth Reddy#Revanth Reddy#Manmohan Singh#Bharat Ratna#Former Prime Minister#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి