తెలంగాణ

SIR: "సర్‌" నోటీసులిచ్చినంత మాత్రాన విచారణకు రానక్కర్లేదు.. ఈసీ కీలక ప్రకటన

రచన: Mahesh•••4 నిమిషాల పఠనం

SIR: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నోటీసుల విషయంలో నెలకొన్న గందరగోళానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈజీ) తెరదించింది. క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చే 'సర్‌' నోటీసులు అందుకున్నంత మాత్రాన సామాన్య ఓటర్లు నేరుగా వ్యక్తిగత విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.

SIR: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నోటీసుల విషయంలో నెలకొన్న గందరగోళానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈజీ) తెరదించింది. క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చే 'సర్‌' నోటీసులు అందుకున్నంత మాత్రాన సామాన్య ఓటర్లు నేరుగా వ్యక్తిగత విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. అత్యంత అనివార్యమైన, అత్యవసరమైన సాంకేతిక సందర్భాల్లో మినహా సాధారణ జనాలను విచారణ పేరిట ఇబ్బంది పెట్టకూడదని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

ఢిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధూ, డాక్టర్ వివేక్ జోషిల నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి భేటీ అనంతరం ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

ఫారం-6 డిక్లరేషన్‌ సరిపోతుంది

ఓటరు నమోదు ప్రక్రియలో సమర్పించే పత్రాలపై ఈసీ స్పష్టతనిచ్చింది. 'సర్‌' ప్రక్రియ నిమిత్తం దరఖాస్తుదారులు 'ఫారం-6'తో పాటు ఇచ్చే డిక్లరేషన్ ఫారం సుప్రీంకోర్టు ఇప్పటికే సమర్థించిందని గుర్తుచేసింది. చట్టబద్ధమైన డిక్లరేషన్ అందుబాటులో ఉన్నప్పుడు, ప్రతి చిన్న అంశానికీ ఓటర్లను విచారణల పేరుతో పిలవాల్సిన పనిలేదని పేర్కొంది.

గతంలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి కమిషనర్లు రాసిన లేఖపై స్పందిస్తూ.. అది ఈసీ లేదా ఐటీ విభాగాల విధానపరమైన వ్యవహారాలకు సంబంధించింది కాదని, కేవలం డిప్యుటేషన్‌పై వచ్చిన ఒక అధికారి పనితీరుపై రాసిన లేఖ మాత్రమేనని స్పష్టం చేసింది.

20 రాష్ట్రాల్లో పూర్తి.. మిగిలిన వారికి స్పెషల్ డ్రైవ్

ఓటర్ల నమోదు ప్రక్రియ దేశవ్యాప్తంగా నిరంతరాయంగా సాగుతుందని ఈసీ తెలిపింది. బిహార్, పశ్చిమ బెంగాల్ సహా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే 'సర్‌' ప్రక్రియ పూర్తయిందన్నారు. జాబితాలో పేర్లు లేని అర్హులు, 18 ఏళ్లు నిండిన యువత సంబంధిత ఈఆర్‌వో లకు దరఖాస్తు చేసుకునేందుకు నిరంతర అప్‌డేషన్ వ్యవస్థ అమల్లో ఉందని చెప్పారు. పేర్లు నమోదుకాని వారి కోసం క్షేత్రస్థాయిలో తక్షణమే 'స్పెషల్ డ్రైవ్' చేపట్టాలని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు (సీఈవోలు) ఆదేశాలు వెళ్లాయన్నారు.

గోవాలో అర్హులైన 97 మంది ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోవడంపై స్పందిస్తూ, అధికారులు నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి దరఖాస్తులు సేకరిస్తున్నారని, ఇప్పటికే 81 మంది ఫారం-6 సమర్పించారని వెల్లడించింది. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును రక్షించడమే లక్ష్యమని ఈసీ పునరుద్ఘాటించింది.

#SIR#Special Intensive Revision#Election Commission of India#ECI#Voter List#Electoral Roll#SIR Notices#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి