క్రైమ్

ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో భారీ మోసం.. రూ.500కోట్లు వసూలు

రచన: NK•••5 నిమిషాల పఠనం

Pre Launch Scam: ప్రీలాంచ్ ఆఫర్ అని ఊరించారు. తక్కువ ధరకే ప్లాట్లు అంటూ ఊదరగొట్టారు. ఇంకేముంది జనాలు టెంప్ట్ అయ్యారు. భలే మంచి బేరం అంటూ ఎగబడ్డారు. సొంతింటి కల నెరవేరుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. కట్ చేస్తే దారుణంగా మోసపోయారు.

Pre Launch Scam: ప్రీలాంచ్ ఆఫర్ అని ఊరించారు. తక్కువ ధరకే ప్లాట్లు అంటూ ఊదరగొట్టారు. ఇంకేముంది జనాలు టెంప్ట్ అయ్యారు. భలే మంచి బేరం అంటూ ఎగబడ్డారు. సొంతింటి కల నెరవేరుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. కట్ చేస్తే దారుణంగా మోసపోయారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. తక్కువ ధరకే ప్లాట్లు అంటూ వందలాది మంది నుంచి 500 కోట్లు వసూలు చేసి చీట్ చేసిన వైనం బయటపడింది. త్రిపురా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ చైర్మన్ పసుపులేటి సుధాకర్ తమను నిండా ముంచేశాడు అంటూ బాధితులు లబోదిబోమంటుననారు.

వందలాది మంది నుంచి రూ.500కోట్లు వసూలు

ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న తెల్లాపూర్ లో తక్కువ ధరకే ప్లాట్లు నిర్మించి ఇస్తామని త్రిపురా కన్‌స్ట్రక్షన్స్ సంస్థ 2021లో పెద్ద ఎత్తున ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో ఒక ప్రకటన ఇచ్చింది. దీని పట్ల చాలామంది అట్రాక్ట్ అయ్యారు. బీడీఎల్ ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు సొంతింటి ఆశతో లక్షల రూపాయలు చెల్లించారు. ఇలా సుమారు 350 మంది నుంచి 500 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. అయితే డబ్బులు తీసుకున్నాక ప్లాట్ల నిర్మాణం చేపట్టకుండా సంస్థ ప్రతినిధులు కాలయాపన చేస్తూ వచ్చారని బాధితులు ఆరోపించారు. అంతేకాదు.. తమకు ప్లాట్లు నిర్మిస్తామని చెప్పి కొనుగోలు చేసిన భూమిని.. ఇప్పుడు మరొక రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

సుధాకర్‌పై సీసీఎస్‌లో ఫిర్యాదు

తాము మోసపోయామని గ్రహించిన బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. త్రిపురా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ చైర్మన్ పసుపులేటి సుధాకర్ పై ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 150 మంది బాధితులు సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో సుధాకర్ పై ఫిర్యాదు చేశారు. తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్ ను మరొకరికి అమ్మే ప్రయత్నం చేస్తున్న సుధాకర్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

నమ్మితే నట్టేట ముంచేశాడు

''2000లో త్రిపురా కన్ స్ట్రక్షన్స్ సుధాకర్ దగ్గర అపార్ట్ మెంట్ తీసుకున్నాం. 2021లో సుధాకర్ పక్కనే ఒక సైటు తీసుకున్నారు. నేను దాన్ని డెవలప్ చేస్తున్నా మీరు కూడా అందులో పెట్టుబడులు పెట్టండి అని మమ్మల్ని కోరారు. అప్పటికే మంచి అపార్ట్ మెంట్ కట్టాడు, తక్కువ ధరకే ప్లాట్స్ ఇచ్చాడని సుధాకర్ ని మేమంతా నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టాము. ఒక్కొక్కరి దగ్గర 50 లక్షల నుంచి 5 కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడు. కానీ, ప్లాట్ల నిర్మాణం మాత్రం చేయలేదు. పైగా ప్లాట్ల కోసం కొన్న భూమిని మరొక సంస్థకు విక్రయించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

మరో రియల్ ఎస్టేట్ సంస్థకు భూమి విక్రయం

ఒక్కొక్కరికి ఒక్కో మాట చెప్పి, మభ్యపెడుతూ కాలయాపన చేసుకుంటూ వచ్చారు. మేము మోసపోయాము. మమ్మల్ని మోసం చేసిన సుధాకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మాకు న్యాయం జరిగేలా, మేము చెల్లించిన డబ్బు తిరిగి ఇప్పించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలి'' అని బాధితులు డిమాండ్ చేశారు.

#Pre Launch Scam#Sanga Reddy#Tellapur#Pre Launch Offer#Tripura Constructions#Pre Launch Flat Scheme#Pasupuleti Sudhakar#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి