ప్రపంచ మానవాళికి మరో మహమ్మారి గండం పొంచి ఉందా? అదృశ్య శత్రువుతో మళ్ళీ జీవన యుద్ధం మొదలవబోతుందా? మానవ మనుగడనే ప్రశ్నించే ఒక భయంకరమైన మిస్టరీ ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని వణికిస్తోంది.. చైనా నుంచి వచ్చి ప్రపంచాన్ని శవాల దిబ్బగా మార్చిన కరోనా కథ మళ్లీ పునరావృతం కాబోతోందా? అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో సామాన్య ప్రజల ప్రాణాలు బలికాబోతున్నాయా? అనే సందేహాలు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి..
సరిగ్గా కొన్ని ఏళ్ల క్రితం... చైనాలోని ఊహాన్ నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ... అబ్బే మా దగ్గర ఏమీ లేదు, అంతా ప్రశాంతం అంటూ చైనా ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, ఆ మౌనం, ఆ అబద్ధం... చివరికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చింది. అసలు బ్రతికి బట్ట కడితే చాలు అనే స్థితిలోకి నెట్టింది. కోట్లాది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బంధువులు, బంధుత్వాలు అంతా బూటకం నాకు ఎవరు లేరు అనేలా మనుషులను ఒంటరిగా మార్చింది. ఆ పరిస్థితులు తలచుకుంటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది.
ఇప్పుడు సరిగ్గా అలాంటి అనుమానాలే రష్యా చుట్టూ ముసురుతున్నాయి.. రష్యా ఆరోగ్య శాఖ అధికారులు ఇది అంత తీవ్రమైనది కాదు, భయపడాల్సింది ఏమీ లేదు అంటూ ఇస్తున్న వివరణలు అంతర్జాతీయ నిపుణులకు నమ్మకం కలిగించడం లేదు. అసలు రష్యా ల్యాబ్‌లలో ఏం జరుగుతోంది? ఉక్రెయిన్‌తో సాగుతున్న యుద్ధంలో అధిపత్యం ప్రదర్శించడానికి రష్యా ఏమైనా రహస్యంగా బయో వెపన్ సిద్ధం చేస్తోందా? అనే సందేహాలు ప్రపంచాన్ని కలవర పెడుతున్నాయి..
అసలు ఏం జరిగింది అంటే.. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్న ఓ ప్లేగూ పరిశోధనా కేంద్రానికి చెందిన యువ ల్యాబొరేటరీ ఉద్యోగి అనుమానాస్పదంగా న్యుమోనియాతో మరణించడం కలకలం రేపింది. ఆమె పనిచేసిన సంస్థలో ప్లేగూతో పాటు ఇతర ప్రమాదకరమైన అంటువ్యాధులపై పరిశోధనలు జరుగుతుండటంతో.. ఇప్పటికే కరోనా వైరస్ విధ్వంసాన్ని మర్చిపోలేకపోతున్న ప్రపంచానికి తాజా ఘటనపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.
పైగా ఆమె మరణించిన ఆసుపత్రిని క్వారంటైన్ చేయడంతో పాటు ఆమెతో సన్నిహితంగా ఉన్న దాదాపు 200 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం పలు అనుమానాలకు బలం చేకూర్చినట్టు అయ్యింది.. కానీ అలాంటిది ఏం లేదని రష్యా చెబుతున్నా నమ్మే పరిస్థితుల్లో ప్రపంచం లేదని తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుతం 2026 అక్టోబర్ నాటికి ప్రపంచంలో ఒకేసారి అనేక ప్రాంతాల్లో యుద్ధాలు, అంతర్యుద్ధాలు, సాయుధ ఘర్షణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే..
ఇక ప్రపంచ ఆధిపత్యం కోసం దేశాల మధ్య సాగుతున్న పోటీ ఇప్పుడు క్షిపణులు, అణు ఆయుధాలు దాటి... కంటికి కనిపించని వైరస్‌లను ఆయుధాలుగా మార్చుకునే భయంకరమైన దిశగా సాగుతోందని పలు నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షణ కోసం కాకుండా... ఎదుటి దేశాన్ని దెబ్బతీయడానికి ఆయుధంగా మార్చుకుంటే, అది తిరిగి సొంత జాతికే ఎసరు పెడుతుందని గతంలో పలు సంఘటనలు నిరూపించాయి..
మరోవైపు చీకటి మాటున ల్యాబ్‌లలో జరిగే పరిశోధనల వల్ల ప్రాణాలు కోల్పోతే గాని విషయం బయటికి పొక్కకపోవడం ఆందోళన కలిగించే అంశం.. ఇలాంటి ప్రయోగాలు చేసే వారికి వాళ్ళ టార్గెట్ మాత్రమే కలల ముందు ఉంటుంది. కానీ పోరాబాటున ఆ ప్రయోగం వికటించి.. ప్రపంచ దేశాలకు పాకితే భూగోళంపై మానవ మనుగడకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
ఇప్పటికే ప్రపంచం ఒక వైపు వాతావరణ మార్పులు, ఊహించని ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతోంది. మరోవైపు తీవ్రమైన ఆహార సంక్షోభం, ద్రవ్యోల్బణం, యుద్ధ మేఘాలు మానవాళిని పిప్పి పిప్పి చేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో... దేశాల స్వార్థం కోసం బయో ఆయుధాలతో చెలగాటం ఆడితే, ఈ భూగోళంపై మనిషి ఉనికి లేకుండా పోతుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక నాడు చైనా దాచిన రహస్యం ప్రపంచాన్ని ముంచేసింది... నేడు రష్యా ఇస్తున్న వివరణల వెనుక ఉన్న అసలు నిజమేంటో తేలాల్సి ఉంది. ఈ మిస్టరీ వీడకపోతే... భూగోళం మరోసారి ఒక అదృశ్య శత్రువు ముందు మోకరిల్లక తప్పదనే సందేహాలు పుడుతున్నాయి.. ఏది ఏమైనా పాతకాలపు రోజులే నయం.. ఇప్పుడు జీవిత సవాళ్ళతో పాటు.. ఆర్థికంగా, ఆరోగ్య సవాళ్ళతో పాటు మరెన్నో ప్రమాదాలతో నిత్యం యుద్దం చేస్తూ బ్రతకవలసిన పరిస్థితులు నెలకొనడం విచారకరమని లోకాన చర్చలు మొదలైయ్యాయి..


