Airtel Postpaid Plans: టెలికాం రంగంలో ప్రముఖ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తమ పోస్ట్‌పెయిడ్ యూజర్స్‌కి గట్టి షాకిచ్చింది. అన్ని రకాల పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను ఉన్నపళంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో ప్లాన్‌పై ఏకంగా రూ.50 చొప్పున భారం మోపడంతో యూజర్స్‌కి నెలవారీ బిల్లులు మరింత పెరగనున్నాయి. పెరిగిన చార్జీల ప్రకారం.. ఇండివిడ్యువల్ ప్లాన్ కనీస ధర ఇప్పుడు రూ.499కి చేరింది. ఫ్యామిలీ ప్యాక్‌ల విషయానికి వస్తే, ఇద్దరు వ్యక్తుల ప్లాన్ రూ.749 కాగా, ముగ్గురు వ్యక్తుల ప్లాన్ రూ.1,049కి పెరిగింది. నలుగురు సభ్యుల ప్లాన్లు రూ.1,249, రూ.1,449గా మారగా, ఐదుగురు సభ్యుల ప్లాన్ ఏకంగా రూ.1,799కి చేరుకుంది.
ధరల పెంపుతో వినియోగదారులపై అదనపు భారం పడినప్పటికీ, కస్టమర్లను ఊరడించేందుకు ఎయిర్‌టెల్ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై ఉచితంగా అంతర్జాతీయ రోమింగ్ బెనిఫిట్‌ను యాడ్ చేసింది. దీని ద్వారా విదేశాలకు వెళ్లేవారు 5 రోజుల పాటు 5 జీబీ డేటా, 60 నిమిషాల కాలింగ్, 25 ఎస్ఎంఎస్‌లను ఫ్రీగా పొందవచ్చని సంస్థ ప్రకటించింది. అయినప్పటికీ నిత్యం లోకల్ సేవలపైనే డిపెండ్ అయ్యే సాధారణ పోస్ట్‌పెయిడ్ యూజర్స్‌కి మాత్రం ఈ రూ.50 పెంపు చేదువార్తగానే మిగిలింది.


