Revanth Reddy: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన పదవి నుంచి తప్పుకునేంత వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శాంతియుతంగా చేపట్టిన నిరసనను అణచివేయడం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల నియంతృత్వ పోకడలకు పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. అరెస్టు అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేరళ సీఎం వీడీ సతీశన్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం సామాన్యుల ఓటు హక్కును కాలరాస్తోందని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, గిరిజన, మైనారిటీ వర్గాల ఓట్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ సర్ ప్రక్రియను వెనువెంటనే ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేసిన కేంద్ర పాలకులు, ఇప్పుడు నేరుగా ఎన్నికల సంఘాన్ని తమ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని, ఆ లక్ష్యం నెరవేరేవరకు దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని రేవంత్ హెచ్చరించారు.












